Telugu Global
Telangana

విమానంలో ప్రయాణికుడికి చికిత్స చేసిన గవర్నర్ తమిళిసై

తెలంగాణ గవర్నర్ తమిళిసై డాక్టర్ అవతారం ఎత్తారు. విమాన ప్రయాణంలో ఓ ప్రయాణికుడికి ఛాతి నొప్పి రావడంతో.. ప్రథమ చికిత్స చేసి కాపాడారు.

విమానంలో ప్రయాణికుడికి చికిత్స చేసిన గవర్నర్ తమిళిసై
X

తెలంగాణ గవర్నర్ తమిళిసై విమాన ప్రయాణంలోని ఓ ప్యాసింజర్ ప్రాణాలు కాపాడారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో శుక్రవారం రాత్రి తమిళిసై వస్తున్నారు. ఈ క్రమంలో విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది ప్రయాణికుల్లో ఎవరైనా వైద్యులు ఉన్నారా అని ఆరా తీశారు. స్వతహాగా డాక్టర్ అయిన తమిళిసై వెంటనే స్పందించారు.

ఛాతి నొప్పితో బాధపడుతున్న వ్యక్తికి ప్రాథమిక చికిత్స చేశారు. సీపీఆర్ చేయడంతో సదరు ప్రయాణికుడు ఉపశమనం పొందారు. కోలుకున్న వెంటనే సదరు వ్యక్తితో పాటు, విమాన సిబ్బంది, ప్రయాణికులు గవర్నర్ తమిళిసైకి కృతజ్ఞతలు తెలిపారు. సరైన సమయంలో స్పందించిన విమాన సిబ్బందిని గవర్నర్ అభినందించారు. ఆ సమయంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు.

విమానంలో ఫస్ట్ ఎయిడ్‌కు సంబంధించిన కిట్ తప్పనిసరిగా ఉంచాలని చెప్పారు. విమాన ప్రయాణం చేసే వారిలో వైద్యులు ఉంటే వారి వివరాలను ముందే అందుబాటులో ఉంచేలా ఒక విధానాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఛాతి నొప్పి, గుండె నొప్పి వచ్చిన వారికి వెంటనే సీపీఆర్ చేస్తే ప్రాణాలను రక్షించే వీలుంటుందని అన్నారు.

విమాన సిబ్బందితో పాటు, సామాన్య ప్రజలు కూడా సీపీఆర్ ఎలా చేయాలో నేర్చుకోవాలని ఆమె తెలిపారు. సీపీఆర్ ఆపద సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని గవర్నర్ పేర్కొన్నారు. కాగా, వ్యక్తిగత పనిపై వారణాసి వెళ్లిన గవర్నర్ తమిళిసై.. శుక్రవారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఆ సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో తోటి ప్రయాణికుడు ఒకరు ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్ అయ్యాయి.



First Published:  23 July 2022 8:23 AM GMT
Next Story