Telugu Global
Telangana

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఘటనపై నివేదిక కోరిన గవర్నర్ తమిళిసై

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో మహిళపై జరిగిన దారుణంపై 48 గంటల్లోగా రాజ్‌భవన్‌కు పూర్తి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని కోరారు.

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఘటనపై నివేదిక కోరిన గవర్నర్ తమిళిసై
X

హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఆగస్టు 15 రాత్రి ఒక మహిళపై పోలీసులు లాఠీలతో హింసించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. స్వాతంత్ర దినోత్సవం రోజే ఒక మహిళపై ఇద్దరు పోలీసులు దాష్టీకానికి పాల్పడిన ఘటనపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ఎల్బీనగర్ ఘటనలో పోలీసుల తీరుపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణ సంఘటనపై వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీకుమార్, రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్‌లకు గవర్నర్ తమిళిసై ఆదేశాలు జారీ చేశారు.

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో మహిళపై జరిగిన దారుణంపై 48 గంటల్లోగా రాజ్‌భవన్‌కు పూర్తి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని కోరారు. బాధిత మహిళకు అండగా ఉండాలని రెడ్ క్రాస్ సొసైటీకి గవర్నర్ తమిళిసై సూచించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు పోలీసులను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు రాచకొండ సీపీ చౌహాన్ తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ శివశంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మహిళపై జరిగిన దాడి ఘటనలో విచారణ చేసి.. పూర్తి నివేదికను సీపీ చౌహాన్ తెప్పించుకున్న తర్వాతే పోలీసులకు సస్పెన్షన్ ఉత్తర్వులు అందినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

ఆగస్టు 15వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో ఎల్బీనగర్ చౌరస్తాలో పోలీసులకు ఒక మహిళలో పాటు ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు కనిపించారు. అయితే రోడ్డుపై వారు ముగ్గురూ ఇబ్బంది కలిగిస్తున్నారని పేర్కొంటూ పోలీసులు స్టేషన్‌కు తరలించి సెక్షన్ 290 కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తనను ఎందుకు తీసుకొని వచ్చారంటూ మహిళ ప్రశ్నించగా.. విధుల్లో ఉన్న కానిస్టేబుల్స్ శివశంకర్, సుమలత ఆమెను దారుణంగా లాఠీలతో కొట్టారు. రాత్రంతా తనను స్టేషన్‌లోనే ఉంచి.. ఇష్టానుసారం కొట్టారని తర్వాతి రోజు ఇంటికి వచ్చిన మహిళ బంధువులకు చెప్పింది. అంతే కాకుండా తన శరీరంపై ఉన్న కమిలిన గుర్తులను కూడా చూపించింది.

బుధవారం ఆమెతో పాటు బంధువులు అందరూ కలిసి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆమె వద్ద నుంచి సెల్‌ఫోన్‌తో పాటు రూ.3 లక్షలు కూడా పోలీసులు తీసుకున్నారని.. ఆ డబ్బును తన తమ్ముడి దగ్గర నుంచి తీసుకొని ఇంటికి వస్తుండగా పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారని బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం ఆమె, బంధువుల ఆరోపణలు నిజం కాని అంటున్నారు. రోడ్డుపై న్యూసెన్స్ చేస్తుండటంతోనే స్టేషన్‌కు తీసుకొని వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.

First Published:  19 Aug 2023 2:37 AM GMT
Next Story