Telugu Global
Telangana

తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై పొగడ్తలు

సీఎం కేసీఆర్ సీనియర్ లీడర్ అని, ఆయనకు చాలా రాజకీయ అనుభవం ఉందని చెప్పారు గవర్నర్ తమిళిసై. ఆయన ఓ పవర్ ఫుల్ నేత అన్నారు.

తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై పొగడ్తలు
X

తెలంగాణ ప్రభుత్వంపై పొగడ్తల వర్షం కురిపించారు గవర్నర్ తమిళిసై. తెలంగాణ గవర్నర్ గా నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆమె, ప్రభుత్వం చేపట్టిన మంచి పనుల్ని మెచ్చుకున్నారు. వైద్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు.

కేసీఆర్ పవర్ ఫుల్..

సీఎం కేసీఆర్ సీనియర్ లీడర్ అని, ఆయనకు చాలా రాజకీయ అనుభవం ఉందని చెప్పారు గవర్నర్ తమిళిసై. ఆయన ఓ పవర్ ఫుల్ నేత అన్నారు. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చూస్తున్నానని చెప్పారు. రాజ్‌ భవన్‌ కి, ప్రగతి భవన్‌ కు మధ్య గ్యాప్‌ లేదని చెప్పారు. సీఎంతో ఎలాంటి దూరం లేదని స్పష్టం చేశారు. అసలు దూరం గురించి తాను పట్టించుకోనన్నారు. కేసీఆర్ ని చూసి తాను చాలా నేర్చుకున్నానని అన్నారు గవర్నర్.


తెలంగాణ పుట్టినరోజు, తన పుట్టినరోజు ఒకటేనని అందుకే తనకు తెలంగాణ అంటే ప్రత్యేక అభిమానం అని చెప్పుకొచ్చారు గవర్నర్ తమిళిసై. తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నానని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షకురాలిగా శక్తి వంచన లేకుండా రాష్ట్రానికి తాను సేవలు అందిస్తున్నట్లు తెలిపారు గవర్నర్. రాజ్‌ భవన్‌ ను తాను ప్రజాభవన్‌ గా మార్చానని, కోర్టు కేసులు, విమర్శలకు భయపడనని చెప్పారు. ఇక్కడ జిల్లాల పర్యటనకు వెళ్తే ఐఏఎస్‌ అధికారులు రారు అని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని, కన్నింగ్‌ ఆలోచనలు తనకు లేవని అన్నారు.

ఆర్టీసీ బిల్లుపై అనవసర రాద్ధాంతం జరిగిందన్నారు గవర్నర్ తమిళిసై. తాను ఆర్టీసీ కార్మికుల లబ్ధికోసమే బిల్లుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించానన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ భర్తీపై కూడా ఆమె స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వంతో తనకు అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. జమిలి ఎన్నికలను తాను సమర్థిస్తానన్నారు గవర్నర్ తమిళిసై.

First Published:  8 Sep 2023 10:31 AM GMT
Next Story