Telugu Global
Telangana

గవర్నర్ మరో వివాదం: టీవీ చర్చ‌లో తెలంగాణ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసిన తమిళిసై

సాధారణంగా, గవర్నర్లు టెలివిజన్ చర్చలలో పాల్గొనరు. గవర్నర్ల ఉపన్యాసాలను టీవీ ఛానళ్ళు ప్రసారం చేయడం కానీ, ఏదైనా అధికారిక విషయంలో తమ అభిప్రాయాలను టీవీ ఛానళ్ళలో వ్యక్తం చేయడంగానీ పరిపాటి. కానీ తెలంగాణ గవర్నర్ మొదటి సారి ఏకంగా టీవీ డిబేట్ లో, అందులోనూ రాజకీయపరమైన డిబేట్ లో పాల్గొన్నారు.

గవర్నర్ మరో వివాదం: టీవీ చర్చ‌లో తెలంగాణ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసిన తమిళిసై
X

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ టెలివిజన్ న్యూస్ ఛానెల్‌లో జరిగిన చర్చలో పాల్గొనడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

సాధారణంగా, గవర్నర్లు టెలివిజన్ చర్చలలో పాల్గొనరు. గవర్నర్ల ఉపన్యాసాలను టీవీ ఛానళ్ళు ప్రసారం చేయడం కానీ, ఏదైనా అధికారిక విషయంలో తమ అభిప్రాయాలను టీవీ ఛానళ్ళలో వ్యక్తం చేయడంగానీ పరిపాటి. కానీ తెలంగాణ గవర్నర్ మొదటి సారి ఏకంగా టీవీ డిబేట్ లో, అందులోనూ రాజకీయపరమైన డిబేట్ లో పాల్గొన్నారు.

ఓ జాతీయ ఛానల్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి తో డిబేట్ లో పాల్గొన్నారు గవర్నర్ తమిళిసై.

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్పీచ్ కాపీని ఎందుకు అందజేయలేదో చెప్పాలని గవర్నర్ పెద్ద గొంతుతో డిమాండ్ చేశారు.టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రావుల శ్రీధర్‌రెడ్డి అందుకు కారణాలను వివరిస్తున్నప్పటికీ వినకుండా ఆమె పదే పదే అదే డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్‌ను పాటించడం లేదని, గవర్నర్ కార్యాలయాన్ని గౌరవించడం లేదని ఆమె పదే పదే ఆరోపించారు.

“మేము ఏ రాజ్యాంగ పదవులను అగౌరవపరచాలనుకోవడం లేదు. మా ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఓ గవర్నర్ మీడియాకు ఎక్కిన ఏకైక రాష్ట్రం ఇదే కాబోలు''' అని రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ఏడు బిల్లులను గవర్నర్ పెండింగ్ లో పెట్టారని శ్రీధర్ రెడ్డి అన్నారు. గవర్నర్ బిల్లులను ఆమోదించడమో లేదా ప్రభుత్వానికి తిరిగి పంపడమో చేయాలని ఆయన అన్నారు.

అయినా కూడా గవర్నర్ శ్రీధర్ రెడ్డి మాట్లను పట్టించుకోకుండా తన వాదనను కొనసాగించారు. గణతంత్ర వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తన ప్రసంగ ప్రతిని తనకు ఎందుకు అందజేయాలని ఆమె ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ అటు రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ కలకలానికి కారణమయ్యింది.

BRS చేవెళ్ల ఎంపీ జి రంజిత్ రెడ్డి ట్వీట్ చేస్తూ, ఇది అపూర్వమైనది! ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా గవర్నర్ టీవీ చర్చలో పాల్గొనడం ఏంటి ? అని ప్రశ్నించారు.

సోషల్ మీడియాలో ఇతర నెటిజనులు కూడా గవర్నర్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఆమె బీజేపీ నాయకురాలిగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు.


First Published:  28 Jan 2023 2:08 AM GMT
Next Story