Telugu Global
Telangana

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి.. - మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికి తెచ్చేందుకు ఈ నెల 29 నుంచి 31 వరకు సీఎం కప్ టోర్నమెంట్‌ల‌ను నిర్వహించడం జరిగిందన్నారు.

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి.. - మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
X

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దక్షతతో దేశంలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందనంతగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సీఎం కప్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అగ్రస్థానంలో ఉందన్నారు. క్రీడా రంగంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎంతో వృద్ధి కనిపిస్తుందని చెప్పారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో తమ ప్రతిభను కనబరిచిన క్రీడాకారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహకాలను అందించారని తెలిపారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికి తెచ్చేందుకు ఈ నెల 29 నుంచి 31 వరకు సీఎం కప్ టోర్నమెంట్‌ల‌ను నిర్వహించడం జరిగిందన్నారు.

క్రీడల్లో గెలుపోటములు సహజమని, గెలిస్తే బాధ్యతగా ముందుకు వెళ్లాలని, ఓడితే మళ్ళీ గెలిచే వరకు శ్రమించాలని క్రీడాకారుల‌కు ఆయన సూచించారు. ఈ మధ్యకాలంలో క్రీడలను కూడా వ్యాపారంగా మార్చారన్నారు. ఐపిఎల్ మొత్తం కమర్షియల్‌గా మారడం వల్ల బెట్టింగ్ మాఫియా చెలరేగి అమాయకులు నష్టపోతున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి భవిష్యత్తులో ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

First Published:  31 May 2023 1:25 PM GMT
Next Story