Telugu Global
Telangana

మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : సీఎం కేసీఆర్

జైన మతపెద్దల కోరిక మేరకు 'జైన భవన్' నిర్మాణానికి ఉప్పల్ భగాయత్‌లో 2 ఎకరాలు కేటాయిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : సీఎం కేసీఆర్
X

మైనార్టీ మతాలకు చెందిన వారి సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. గంగా జమున తెహజీబ్‌కు నిలయమైన తెలంగాణ రాష్ట్రంలో.. దేశంలోని పలు ప్రాంతాలకు, మతాలకు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు వచ్చి నివసిస్తున్నారు. వారందరూ సుఖశాంతులతో కలిసి జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జైన మత పెద్దలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.

మైనార్టీల హక్కులను గుర్తించి, తమకు మైనార్టీ కమిషన్‌లో ప్రాతినిథ్యం కల్పించినందుకు వారు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జైన మతపెద్దల కోరిక మేరకు 'జైన భవన్' నిర్మాణానికి ఉప్పల్ భగాయత్‌లో 2 ఎకరాలు కేటాయిస్తున్నామని చెప్పారు. అలాగే మహవీర్ హాస్పిటల్ చైర్మన్, జైన మతపెద్దల విన్నపం మేరకు హైదరాబాద్ మసాబ్ ట్యాంకులో ఎన్నో దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న 'మహావీర్ హాస్పిటల్' లీజు భూమిని.. ఉచితంగా వారికే కేటాయిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు.

భారత దేశానికి నీరు, భూమి, వాతావరణం, సూర్యరశ్మి వంటి ప్రకృతి అందించిన వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో 75 ఏళ్లుగా దేశ పాలకులు వైఫల్యం చెందారని కేసీఆర్ అన్నారు. దేశంలో లభిస్తున్న ప్రకృతి వనరుల వివరాలను వారికి వివరించారు. వ్యవసాయాధారిత దేశంలో కేంద్రంలోని పాలకుతకు దార్శనికత లేకపోవడం రైతుల పాలిట శాపంగా మారిందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి.. ఇప్పుడు దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని అన్నారు. ప్రజలందరి సహకారంతో దేశవ్యాప్తంగా అభివృద్ధిని పరిచయం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

గత పాల కుల హయాంలో ఏన్నడూ లేని విధంగా అత్యంత సమర్థవంతంగా, శాంతి భద్రతలను పటిష్టంగా కొనసాగిస్తూ సీఎం కేసీఆర్ పాలిస్తున్నారని జైన మత పెద్దలు ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తూ రామరాజ్య పాలనను అందిస్తున్నారని వారు కీర్తించారు. పారిశ్రామిక అభివృద్ధి, వ్యాపార, వాణిజ్య రంగాల్లో తెలంగాణ ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని ఇంతటి అభివృద్ధి కేసీఆర్ దార్శనికతతో సాధ్యమైందని అన్నారు. నాణ్యమైన విద్యుత్, మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.

ఈ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీజైన్ సేవా సంఘం చైర్మన్ అశోక్ బర్మేచా, ప్రెసిడెంట్ యోగేశ్ జైన్, వైస్ ప్రెసిడెంట్ వినోద్ సంచతి, సెక్రటరీ జీమురా, జైన్ రత్న అవార్డు గ్రమీత సురేందర్ లోనియా, మహావీర్ హాస్పిటల్స్ మాజీ చైర్మన్ మోతీలాల్ జైన్, మాజీ అధ్యక్షుడు గౌతమ్ లోదా, మాజీ కార్యదర్శి బసంత్, జూవెలరీ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ షెర్మల్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

First Published:  23 May 2023 2:48 AM GMT
Next Story