Telugu Global
Telangana

దళిత బంధు రెండో విడతకు అనుమతిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం

దళితబంధు రెండో విడతలో నియోజకవర్గానికి 1115 మంది లబ్దిదారులకు ఈ పథకం అమలు చేయనున్నారు.

దళిత బంధు రెండో విడతకు అనుమతిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం
X

దళితులు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలుగా మారడమే కాకుండా.. మరో నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం దళితబంధు అమలు చేస్తున్నది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి తొలి విడతలో ప్రతీ నియోజకవర్గంలో 100 మందికి రూ.10 లక్షల చొప్పున అందించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తొలుత అమలు చేశారు. పైలెట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్‌కు 1000 యూనిట్లు కేటాయించారు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రెండో విడతకు తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పింది.

దళితబంధు రెండో విడతలో నియోజకవర్గానికి 1115 మంది లబ్దిదారులకు ఈ పథకం అమలు చేయనున్నారు. ఈ మేరకు జీవో విడుదల చేశారు. రెండో విడత దళితబంధు జీవో విడుదల చేయడం పట్ల రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లు వెంటనే ఈ పథకం లబ్దిదారులను ఎంపిక చేయాలని.. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ ముగించాని ఆయన సూచించారు.

దళితబంధు రెండో విడతలో 1,29,800 మంది లబ్దిదారులకు రూ.10 లక్షల చొప్పున అందించనున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దళితుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ పథకం తీసుకొని వచ్చింది. ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందుకున్న కుటుంబాలు ఇప్పటికే ఉన్నత ప్రమాణాలతో జీవనం కొనసాగిస్తున్నారు. చాలా మంది సొంత వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు పెట్టుకొని పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. రెండో విడతలో కూడా భారీగా లబ్దిదారులు ఉండబోతున్నారు. వాళ్లు కూడా తప్పకుండా ఉన్నత స్థాయికి చేరతారని కొప్పులు ఈశ్వర్ అన్నారు. సీఎం కేసీఆర్‌కు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

ప్రతిపక్షాలు దళితబంధు పథకంపై రాద్దాంతం చేయడం మానేయాలని సూచించారు. ప్రతిపక్షాల విమర్శలను ప్రజలే తిప్పికొడుతున్నారని చెప్పారు. రాజకీయ లబ్ది కోసమే ప్రతిపక్షాలు ఈ పథకం, సీఎం కేసీఆర్‌పై బురద జల్లుతున్నాయని మండిపడ్డారు. దళితులకు సాయం చేస్తున్న ఈ పథకంపై రాద్దాంతం చేయడం మంచి ధోరణి కాదని ప్రతిపక్షాలకు హితవు పలికారు.

First Published:  25 Jun 2023 1:25 AM GMT
Next Story