Telugu Global
Telangana

ఆ రెండు శాఖల ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్‌కు పే స్కేల్ వర్తింపు

మెప్మాలో పని చేస్తున్న వారికి పే స్కేల్ వర్తింప చేసే జీవో ఈ నెల 11నే జారీ చేశారు. ఇక సెర్ప్ ఉద్యోగులకు సంబంధించిన జీవో మార్చిలోనే జారీ అయ్యింది. తాజాగా ఈ రెండు జీవోలు బయటకు వచ్చాయి.

ఆ రెండు శాఖల ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్‌కు పే స్కేల్ వర్తింపు
X

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్న మెప్మా, సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పే స్కేల్ అమలు చేయనున్నట్లు పేర్కొన్నది. మెప్మాలో పని చేస్తున్న 378 ఉద్యోగులకు పే స్కేల్ వర్తింప చేస్తూ మున్సిపల్, అర్బన్ డెవపల్‌మెంట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సెర్ప్‌లో పని చేస్తున్న 3,974 మందికి కూడా ఈ పే స్కేల్ వర్తించనున్నది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.

మెప్మాలో పని చేస్తున్న వారికి పే స్కేల్ వర్తింప చేసే జీవో ఈ నెల 11నే జారీ చేశారు. ఇక సెర్ప్ ఉద్యోగులకు సంబంధించిన జీవో మార్చిలోనే జారీ అయ్యింది. తాజాగా ఈ రెండు జీవోలు బయటకు వచ్చాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచే మెప్మా, సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ వర్తింప చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ రెండు శాఖల్లోని ఉద్యోగులకు కనీస వేతనానికి సమీపంలో ఉన్న పే స్కేళ్లను రాష్ట్ర ప్రభుత్వం వర్తింప చేయనున్నది.

మున్సిపల్ శాఖ పరిధిలోని మెప్మా ఉద్యోగులకు కనీస వేతనానికి కూడా రక్షణ కల్పించనున్నారు. సెర్ప్ ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుత స్థూల వేతనం, ఇతర అలవెన్సులకు కూడా రక్షణ ఉండనున్నది. కాగా, ప్రభుత్వం పే స్కేల్ వర్తింప చేసినా సెర్ప్, మెప్మా ఉద్యోగులు ఇప్పటి తరహాలోనే రిజిస్టర్డ్ సొసౌటీ ఉద్యోగులుగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొన్నది.

మెప్మా, సెర్ప్‌లో పని చేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఈ ఉత్తర్వుల ద్వారా క్రమబద్దీకరణ చేసినట్లుగా లేదా ప్రభుత్వంలో విలీనం చేసినట్లుగా పరిగణించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో ఉన్న మాదిరిగానే ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలు కూడా యథాతథంగానే ఉంటాయని ఉంటాయని తెలిపారు. ఇకపై కొత్తగా రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టులను సృష్టించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పని సరిగా తీసుకోవాల్సి ఉంటుంది.

First Published:  18 Aug 2023 3:31 AM GMT
Next Story