Telugu Global
Telangana

నిరుద్యోగులకు శుభవార్త.. కానీ..!

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రేవంత్ సర్కారు శుభవార్త చెప్పింది.

నిరుద్యోగులకు శుభవార్త.. కానీ..!
X

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రేవంత్ సర్కారు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రస్తుతమున్న గరిష్ఠ వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. యూనిఫాం సర్వీసులు మినహా, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికి ఇది వర్తిస్తుందని తెలిపింది. వయోపరిమితి పెంపు రెండేళ్ల పాటు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి గతంలో 34 ఏళ్లుగా ఉండేది. తెలంగాణ వచ్చాక 2015లో వయో పరిమితిని 10 ఏళ్లు పొడిగించి 44 ఏళ్లుగా ఫిక్స్‌ చేశారు. ఆ ఉత్తర్వు రెండేళ్లు అమల్లో ఉంది. ఆ తరువాత తిరిగి 2022లో మరోసారి గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లుగా ప్రభుత్వం ఖరారు చేసింది. దీన్ని మరింత సడలించాలని నిరుద్యోగుల నుంచి విజ్ఞప్తులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఏజ్ రిలాక్సేషన్‌ మరో రెండేళ్లు పెంచాలంటూ టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఈనెల 3న ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో సర్కారు కొలువులకు గరిష్ఠ వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

టీపీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం సరైన సమయంలో నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో చాలా మంది నిరుద్యోగులు నిరాశకు గురవుతున్నారు. ఏజ్ లిమిట్ దాటిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న రేవంత్ సర్కార్.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వయోపరిమితి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వయో పరిమితి పెంచటం ఆనందించే విషయమే అయినా.. ఉద్యోగాల కోసం కాంపిటీషన్ భారీగా ఉండబోతోంది అనేది అసలు విషయం. దీన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు పరీక్షలకు కఠినంగా సిద్ధం కావాల్సి ఉంటుంది.

First Published:  13 Feb 2024 2:12 AM GMT
Next Story