Telugu Global
Telangana

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఎంబీబీఎస్ లో లోకల్ రిజర్వేషన్..

వైద్య ఆరోగ్య శాఖ జీవో నెంబర్ 129, 130 లను విడుదల చేసింది. దీంతో రాష్ట్రం లోని మొత్తం 24 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 1,068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థుల‌కే ల‌భించ‌బోతున్నాయి.

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఎంబీబీఎస్ లో లోకల్ రిజర్వేషన్..
X

డాక్ట‌ర్ కావాలని కష్టపడుతున్న విద్యార్థులకు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్- బి కేట‌గిరీ సీట్ల‌లో 85శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే దక్కేలా అడ్మిషన్ నిబంధనలు సవరించింది. ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖ జీవో నెంబర్ 129, 130 లను విడుదల చేసింది. దీంతో రాష్ట్రం లోని మొత్తం 24 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 1,068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థుల‌కే ల‌భించ‌బోతున్నాయి.

రాష్ట్రంలో 20 నాన్ మైనారిటీ, 4 నాన్ మైనారిటీ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మొత్తం 3750 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నాన్ మైనార్టీ కాలేజీల్లో 3200 సీట్లు ఉండగా ఇందులో బి కేటగిరీ కింద 35 శాతం(1120) సీట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇవి ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. అంటే అన్ని రాష్ట్రాల విద్యార్థులు వీటికోసం పోటీ పడొచ్చు. తాజా సవరణ మేరకు ఈ 1120 సీట్లలో 85 శాతం (952) సీట్లు ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థుల కోసం కేటాయిస్తారు. మిగతా 15శాతం.. అంటే 168 సీట్లు ఓపెన్ కోటాలో ఉంటాయి. వీటికి తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల విద్యార్థులు పోటీ పడొచ్చు.

మైనార్టీ కాలేజీలలో 25 శాతం సీట్లు బి కేటగిరీలో ఉంటాయి. అలా బి కేటగిరీలో ఉన్న సీట్లలో 116 సీట్లు ఇప్పుడు తెలంగాణ విద్యార్థులకు రిజర్వ్ అవుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మేనేజ్మెంట్ కోటా సీట్లలో తెలంగాణ విద్యార్థులకు ప్రత్యేకంగా ఎలాంటి రిజర్వేషన్ లేదు. బి కేటగిరీలో ఉన్న 35 శాతం కోటాలో ఎలాంటి లోకల్ రిజర్వేషన్లు అమలు చేయక పోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఇక్కడి కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు సొంతం చేసుకుంటున్నారు. దీని వల్ల తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని భావించిన ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానంపై ఓ నివేదిక తెప్పించింది. ఈ నివేదిక ప్రకారం మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఒడిశా, మధ్య ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో బి కేటగిరీలో ఓపెన్ కోటా విధానమే లేదని తేలింది. గతేడాది నుంచి బి కేటగిరీ సీట్లన్నీ ఆయా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు మాత్రమే కేటాయిస్తున్నారు.

దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి విద్యార్థులకు లాభం చేకూరేలా తాజా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 1,068 మంది విద్యార్థులు లబ్ధి పొందబోతున్నారు. ఎంబీబీఎస్ విద్య కోసం ఇతర రాష్ట్రాలు సహా, ఉక్రెయిన్, చైనా, రష్యా వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తెలంగాణలోనే డాక్టర్ విద్య అభ్యసించేందుకు అవకాశాలు మెరుగుపడుతున్నాయి. తెలంగాణలో జిల్లాకో మెడికల్ కాలేజీ ప్రారంభించి వైద్య విద్యను పటిష్టం చేస్తున్న క్రమంలో, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనూ ఇక్కడ విద్యార్థులకే ఎక్కువ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

First Published:  29 Sep 2022 9:26 AM GMT
Next Story