Telugu Global
Telangana

అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 70వేల మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు లబ్ధి పొందుతారు. వారికి జీతాల పెంపు విషయంలో భద్రత లభిస్తుంది.

అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
X

డిమాండ్ల సాధనకోసం కొన్నిరోజులుగా నిరసన ప్రదర్శనలు చేపట్టిన అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగుల లాగే పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే పీఆర్సీలో అంగన్వాడీలను కూడా చేరుస్తామని స్పష్టం చేసింది. త్వరలో ప్రకటించే పీఆర్సీతోటే ఈ నియమం అమలులోకి వస్తుంది. ఈమేరకు మంత్రి హరీష్ రావుతో, అంగన్వాడీలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వ నిర్ణయంపై అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేశారు.

ఈరోజు మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్ తో అంగన్వాడీలు సమావేశమయ్యారు. అంగన్వాడీలకు కూడా పీఆర్సీ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రులు అంగన్వాడీలకు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం పెండింగ్‌ బిల్లులను సైతం త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన డిమాండ్లపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 70వేల మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు లబ్ధి పొందుతారు. వారికి జీతాల పెంపు విషయంలో భద్రత లభిస్తుంది. ప్రతిసారీ జీతాల పెంపుకోసం వారు ప్రభుత్వాలను అభ్యర్థించాల్సిన అవసరం ఉండదు. పీఆర్సీ ప్రకారం వారి జీతాలు కూడా పెరుగుతాయి. సీఎం కేసీఆర్ నిర్ణయంపై తెలంగాణ అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేశారు.

First Published:  1 Oct 2023 8:15 AM GMT
Next Story