Telugu Global
Telangana

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్..

“నేనే గెలిపించుకుంటా. తప్పు చేసిన వారికి మాత్రం టికెట్లు దక్కవు. నేను అసలే మొండివాడిని. మీరు కోరి ఇబ్బందులు తెచ్చుకోవద్దు.”అంటూ ఎమ్మెల్యేలకు ఉద్భోదించారు సీఎం కేసీఆర్.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్..
X

బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో దాదాపుగా ఎన్నికలకు వార్నింగ్ బెల్ కొట్టేశారు సీఎం కేసీఆర్. ఎన్నికల ఏడాదిలో ఉన్నామని, జనంలోకి వెళ్లాలని, ప్రతి ఒక్కరినీ పలకరించాలని, ప్రభుత్వ కార్యక్రమాలు వివరించాలని, పాదయాత్రలు చేయాలని ఎమ్మల్యేలు, నేతలకు వివరించారు. అదే సందర్భంలో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు శుభవార్త చెప్పారు. 99శాతం సిట్టింగ్ లకే ఈసారి కూడా ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తామన్నారు. దీంతో ఒకరకంగా ఎమ్మెల్యేలంతా ఫుల్ ఖుషీ అయిపోయారు.

ప్రయోగాలెందుకు..?

సిట్టింగ్ ల స్థానాల్లో కొత్తవారిని నిలబెట్టినా, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి గురించి వివరించి ఓట్లు అడిగే పరిస్థితి ఉంది. కానీ కేసీఆర్ అలాంటి ప్రయోగాలు చేయదలచుకోలేదు. అసంతృప్తి లేని దగ్గర సిట్టింగ్ లకే మరో అవకాశం ఇస్తామంటున్నారు. “గత ఎన్నికల్లో కొందరిని తీరు మార్చుకోవాలని పదే పదే చెప్పి చూశా. వాళ్లు పద్ధతి మార్చుకోలేదు కాబట్టే వారిని మార్చాల్సి వచ్చింది. ఈసారి సిట్టింగులెవరినీ మార్చాలనే ఉద్దేశం నాకైతే లేదు.


ఎవరైనా తమంతట తాము తప్పులు చేస్తే తప్ప.. 99 శాతం సిట్టింగులందరికీ తిరిగి సీట్లు వస్తాయి. నేనే గెలిపించుకుంటా. అయితే తప్పు చేసిన వారికి మాత్రం టికెట్లు దక్కవు. నేను అసలే మొండివాడిని. మీరు కోరి ఇబ్బందులు తెచ్చుకోవద్దు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పారదర్శకంగా వ్యవహరించండి.”అంటూ ఎమ్మెల్యేలకు ఉద్భోదించారు సీఎం కేసీఆర్.

దళితబంధు విషయంలో కొన్నిచోట్ల ఆరోపణలు వచ్చాయని, ఈసారి అలాంటి పరిస్థితులు రానీయకుండా చూసుకోవాలని సూచించారు సీఎం కేసీఆర్. ఇతర సంక్షేమ కార్యక్రమాలను కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. అక్టోబర్ లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, టైమ్ ఉంది కదా అని లైట్ తీసుకోవద్దన్నారు. మొత్తమ్మీద పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎన్నికల సమరశంఖం పూరించారు కేసీఆర్. పార్టీ నేతలు అలర్ట్ గా ఉండాలని సూచించారు. సిట్టింగ్ లకు అభయమిస్తూనే, మరోసారి టికెట్ రావాలంటే తప్పులు చేయొద్దని హెచ్చరించారు.

First Published:  11 March 2023 1:26 AM GMT
Next Story