Telugu Global
Telangana

ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్.. ప్రసూతి సెలవులు ఇచ్చే అంశంపై అధ్యయనం

ఆశాలు, ఏఎన్ఎంలు అందిస్తున్న సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్.. దేశంలోనే అత్యధిక వేతనాలను అందిస్తున్నారని చెప్పారు.

ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్.. ప్రసూతి సెలవులు ఇచ్చే అంశంపై అధ్యయనం
X

తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న ఆశా వర్కర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించబోతోంది. క్షేత్ర స్థాయిలో ఉంటూ.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశ వర్కర్లకు ఇతర మహిళా ఉద్యోగులకు ఇస్తున్నట్లుగానే ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు సమగ్ర అధ్యయనం చేసి.. నివేదికను ఇవ్వాలని హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మహంతిలకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.

ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో మంత్రి హరీశ్ రావు నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశాలు, ఏఎన్ఎంలు అందిస్తున్న సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్.. దేశంలోనే అత్యధిక వేతనాలను అందిస్తున్నారని చెప్పారు. వేతనాల పెరుగుదల, సకాలంలో జీతాలు పొందేందుకు ఒకప్పుడు ధర్నాలు, నిరసనలు తెలియజేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేకుండానే తెలంగాణ ఏర్పాటు తర్వాత మూడు సార్లు వేతనాలు పెంచారని.. ప్రస్తుతం రూ.9,750 ఇస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.

ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఇస్తున్నట్లుగానే ఆశా కార్యకర్తలు, సెకెండ్ ఏఎన్ఎంలకు ప్రసూతి సెలవులు ఇచ్చేందుకు అధ్యయనం చేయించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 14న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్యారోగ్య దినోత్సవాన్ని నిర్వహించుకోబోతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతీ ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని కోరారు. 9 ఏళ్లలో మన రాష్ట్రం సాధించిన అద్భుత ప్రగతిని ప్రజలకు తెలియజేయాలని చెప్పారు.

వైద్యారోగ్య శాఖలో అందరి చేసిన కృషి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని హరీశ్ రావు చెప్పారు. ఏప్రిల్ నెలలో మన ప్రభుత్వ ఆసుపత్రులు రికార్డు సృష్టించాయని అన్నారు. 69 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగాయని, ఇది దేశంలో ఒక రికార్డు అని మంత్రి చెప్పారు. ఇందుకు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల కృషి చాలా ఉందని మంత్రి ప్రశంసించారు.

First Published:  6 Jun 2023 4:11 AM GMT
Next Story