Telugu Global
Telangana

తెలంగాణలో సుపరిపాలన స్వర్ణయుగం నడుస్తోంది : మంత్రి సబిత ఇంద్రారెడ్డి

అధికార వికేంద్రీకరణతో అధికారులపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, పారదర్శకత పెరిగిందని మంత్రి అన్నారు.

తెలంగాణలో సుపరిపాలన స్వర్ణయుగం నడుస్తోంది : మంత్రి సబిత ఇంద్రారెడ్డి
X

స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత రాష్ట్రంలో సుపరిపాలన స్వర్ణయుగం నడుస్తోందని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సుపరిపాలన దినోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..

రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కార్యాలయాలన్నీ ఎక్కడో విసిరేసినట్లుగా ఉండేవి. కానీ కొత్త రాష్ట్రంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయాన్ని నిర్మించి.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని చెప్పారు. పాలనా వికేంద్రీకరణతో ప్రజల వద్దే పాలనను తీసుకొని వచ్చారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు, కమిషనరేట్లు ప్రారంభించి.. సుపరిపాలనను అందిస్తున్నారని ఆమె చెప్పారు.

అధికార వికేంద్రీకరణతో అధికారులపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, పారదర్శకత పెరిగిందని మంత్రి అన్నారు. పారదర్శకమైన పాలన వల్ల, ప్రజలకు సులువుగా పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఒక నాడు నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగం.. ఇవ్వాళ దేశంలోనే ముందుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో తెలంగాణ రైస్ బౌల్‌గా మారిందని చెప్పారు.

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కూడా అనువైన వాతావరణం కల్పించడంతో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయన్నారు. సంక్షేమంలో కూడా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందున్నదని చెప్పారు. దివ్యాంగుల పెన్షన్‌ను సీఎం కేసీఆర్ రూ.1,000 పెంచి రూ.4,116 చేశారని చెప్పారు. ఇందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి సబిత ఇంద్రారెడ్డి చెప్పారు.

First Published:  10 Jun 2023 2:24 PM GMT
Next Story