Telugu Global
Telangana

గోల్కొండ మెట్ల బావి, దోమకొండ కోటకు ప్రతిష్టాత్మక యునెస్కో అవార్డులు

ఆసియా పసిఫిక్ అవార్డుల కోసం ఆరు దేశాల నుంచి 13 కట్టడాలను ఎంపిక చేశారు. ఇండియా, ఆప్గానిస్తాన్, చైనా, ఇరాన్, నేపాల్, థాయిలాండ్‌ దేశాల కట్టడాలు అవార్డులు గెలుచుకున్నాయి.

గోల్కొండ మెట్ల బావి, దోమకొండ కోటకు ప్రతిష్టాత్మక యునెస్కో అవార్డులు
X

తెలంగాణలోని రెండు వారసత్వ కట్టడాలకు ప్రతిష్టాత్మక యునెస్కో అవార్డులు లభించాయి. గోల్కోండ కోటలోని మెట్ల బావి, కామారెడ్డిలోని దోమకొండ కోటకు యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డులు దక్కాయి. సాంస్కృతిక సంపదను పరిరక్షించినందుకు గాను 2022 ఏడాదికి యునెస్కో పలు విభాగాల్లో ఈ అవార్డులు ప్రకటించింది. గోల్కొండ మెట్లబావికి డిస్టింక్షన్ అవార్డు దక్కింది. కుతుబ్ షాహీలు నిర్మించిన ఈ మెట్ల బావి శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రభుత్వం దానిని పునరుద్దరించింది.

పునరుద్దరించిన మెట్లబావిని ఈ ఏడాది సెప్టెంబర్‌లో మంత్రి కేటీఆర్, యూఎస్ కౌన్సిల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌లు ప్రారంభించారు.ఆ సమయంలోనే ఈ కట్టడాన్ని యునెస్కో గుర్తింపు కోసం పంపించాలని కేటీఆర్ సూచించారు. దీంతో అధికారులు కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డు కోసం మెట్లబావి పునరుద్దరణను ఎంట్రీగా పంపారు.అలాగే దోమకొండ కోటకు మెరిట్ అవార్డు లభించింది. దీనిని దోమకొండ సంస్థానం వారసులు పునరుద్దరించారు. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ అనుమతి తీసుకొని.. సంస్థాన వారసులు అనిల్ కామినేని, శోభన కామినేని (అపోలో హాస్పిటల్స్ వైస్-చైర్‌పర్సన్) ఈ కట్టడాన్ని రిస్టోర్ చేశారు.

ఆసియా పసిఫిక్ అవార్డుల కోసం ఆరు దేశాల నుంచి 13 కట్టడాలను ఎంపిక చేశారు. ఇండియా, ఆప్గానిస్తాన్, చైనా, ఇరాన్, నేపాల్, థాయిలాండ్‌ దేశాల కట్టడాలు అవార్డులు గెలుచుకున్నాయి. మొత్తం 11 దేశాల నుంచి 50 ఎంట్రీలు రాగా, వాటిలో 13 కట్టడాలు మాత్రమే అవార్డులు గెలుచుకోవడం విశేషం.

ముంబైలోని చత్రపతి శివాజీ మహరాజ్ వాస్తు సంగ్రహాలయకు హీరోయిక్ విభాగంలో అవార్డు దక్కింది. పునరుద్దరణలో ఈ కట్టడం అత్యుత్తమ ప్రతిభ కనపరిచినట్లు, మంచి నాణ్యతతో ఉన్నట్లు జ్యూరీ వ్యాఖ్యానించింది. ముంబైలోని విక్టోరియన్ గోతిక్ అండ్ ఆర్ట్ డికో ఎన్‌సెంబుల్స్ వారి 100 ఏళ్ల మ్యూజియంకు అవార్డ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ లభించింది. ముంబైలోని బైకుల్లా స్టేషన్‌కు మెరిట్ కేటగిరీ అవార్డు దక్కింది. ఈ అవార్డులు ప్రకటించడం ద్వారా ప్రజల్లు తమ సాంస్కృతిక, వారసత్వ కట్టడాల పట్ల అవగాహన పెరుగుతుందని, అలాగే వారికి బాధ్యత కూడా తెలుస్తుందని యునెస్కో కల్చరల్ యూనిట్ చీఫ్ ఫెంగ్ జింగ్ అన్నారు. శనివారం ఈ అవార్డులను బ్యాంకాక్‌లో ఆయన ప్రకటించారు.

First Published:  27 Nov 2022 1:41 AM GMT
Next Story