Telugu Global
Telangana

ఉగ్ర గోదావరి @ 50 అడుగులు

రాజమండ్రి వద్ద ధవళేశ్వరం ప్రాజెక్టులో నీటిమట్టం మొదటి హెచ్చరికకు చేరువగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజి వద్ద 11.20 అడుగులకు నీటిమట్టం చేరింది. బ్యారేజికి సంబంధించిన 175 గేట్లు ఎత్తేసి, 9.09 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.

ఉగ్ర గోదావరి @ 50 అడుగులు
X

గోదావరి నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 50.5 అడుగుల మేర గోదావరి నీటి మట్టం నమోదైంది. రెండో ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. నీటి మట్టం 53 అడుగులకు పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. భద్రాచలం - ఏజెన్సీ గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. పోలవరం నుంచి నీరు వెనక్కు ఎగదన్నడంతో భద్రాచలం వద్ద ప్రజలు ముంపు భయంతో బిక్కు బిక్కుమంటున్నారు.

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల.. ఎగువ ప్రాంతాల నుంచి వర్షపు నీరు గోదావరిలోకి చేరుతోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇటు ఏపీలో కూడా గోదావరి ప్రభావానికి లోతట్టు ప్రాంతాల వాసులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. రాజమండ్రి వద్ద ధవళేశ్వరం ప్రాజెక్టులో నీటిమట్టం మొదటి హెచ్చరికకు చేరువగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజి వద్ద 11.20 అడుగులకు నీటిమట్టం చేరింది. బ్యారేజికి సంబంధించిన 175 గేట్లు ఎత్తేసి, 9.09 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.

అటు తెలంగాణలో అధికారులు అప్రమత్తం అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల వాసులకు ఆహారాన్ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు ఏపీలో కూడా విపత్తుల నిర్వహణ సంస్థ వరద ముంపు ప్రభావిత మండలాల అధికారులను అప్రమత్తం చేసింది. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ ఎండీ హెచ్చరించారు. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద నీటిలో ప్రయాణాలు చేయొద్దని హెచ్చరించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది రెండు నెలల్లోనే మూడుసార్లు గోదావరికి వరదలు వచ్చాయి.

First Published:  13 Sep 2022 6:16 AM GMT
Next Story