Telugu Global
Telangana

2 నెలల్లో మూడోసారి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద 41అడుగులకు గోదావరి నీటి మట్టం..

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి వరద ప్రవాహం మరింత పెరుగుతుందని, భద్రాచలం వద్ద ప్రవాహం 9 లక్షల క్యూసెక్కుల వరకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. జిల్లా కలెక్టర్ కార్యాలయం, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు.

2 నెలల్లో మూడోసారి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద 41అడుగులకు గోదావరి నీటి మట్టం..
X

గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు ఇప్పటికే పరివాహక ప్రజల్ని ముప్ప తిప్పలు పెట్టిన గోదారమ్మ.. ఇప్పుడు మూడోసారి ముంచెత్తడానికి రెడీగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతూ ఉంది. భద్రాచలం వద్ద మొన్న 30 అడుగుల మేర ఉన్న నీటిమట్టం నేడు 41 అడుగులకు చేరింది. రాత్రికి తొలి ప్రమాద హెచ్చరిక స్థాయికి (43అడుగులు) చేరుకుంటుందని అంచనా.

కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ..

ఇటీవల రెండుసార్లు గోదావరి వరదలకు ప్రజలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో భారీగా వరద రావడంతో ముంపు ప్రభావం ఎక్కువైంది. రైతులు, కూలీలు, ఇతర అన్ని వృత్తుల వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెట్టేబేడా సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. రెండు నెలల వ్యవధిలో ఇప్పుడు మూడోసారి ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ ఎప్పటికప్పుడు పరిస్థితి అంచనా వేస్తున్నారు. ఇటు ఏపీలో కూడా అప్రమత్తత అవసరం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గోదావరి జిల్లాల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి వరద ప్రవాహం మరింత పెరుగుతుందని, భద్రాచలం వద్ద ప్రవాహం 9 లక్షల క్యూసెక్కుల వరకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. జిల్లా కలెక్టర్ కార్యాలయం, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లో 08744-241950, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో 08743-232444 నెంబర్లకు అత్యవసర సమయాల్లో ఫోన్ చేయాలని సూచించారు. వాగులు, వంకలు, నదుల వద్ద వరద ప్రవాహం అధికంగా ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షంలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు, రోడ్లపై నీరు ప్రవహించే చోట అప్రమత్తంగా ఉండాలని కోరారు. గోదావరి వరద ప్రవాహం మరోసారి తీర ప్రాంతవాసుల్ని కలవరపెడుతోంది.

First Published:  12 Sep 2022 11:09 AM GMT
Next Story