Telugu Global
Telangana

నిండుకుండల్లా ప్రాజెక్ట్ లు.. శాంతించిన గోదావరి

భద్రాచలం వద్ద గోదావరి వరద మట్టం 41 అడుగులకు తగ్గింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు.

నిండుకుండల్లా ప్రాజెక్ట్ లు.. శాంతించిన గోదావరి
X

ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడం.. ఉప నదుల్లో వరద ఉధృతి కూడా తగ్గడంతో గోదావరిలో వరద ప్రవా­హం క్రమేణా తగ్గుతోంది. భద్రాచలం వద్ద వరద ప్రవాహం 8.50 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. వరద మట్టం 41 అడుగులకు తగ్గింది. దీంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. భద్రాచలం నుంచి పోలవరం ప్రాజెక్టులోకి 7,75,079 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది.

పోలవరం వద్ద 7,75,079 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌ ­లోకి 9,84,970 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 11,100 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుతున్న 9,73,870 క్యూసె­క్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. దేవీపట్నం మండలంలోని గండిపోశమ్మ ఆలయం ఇంకా వరద నీటలో మునిగిఉంది. విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. చింతూరు, కూనవరం, వీఆర్‌ పురం, ఎటపాక మండలాల్లోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలవాసులు పడవలమీదే రాకపోకలు సాగిస్తున్నారు.

భారీ వర్షాలకు గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. నిజామాబాద్‌ జిల్లా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. శ్రీరాంసాగర్‌ గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1079.10 అడుగుల నీరు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు, ప్రస్తుతం ప్రాజెక్ట్ లో 49.96 టీఎంసీలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోంది. గరిష్ట నీటిమట్టం 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 13972.52 అడుగుల నీరు నిల్వ ఉంది. నిర్మల్‌ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టులోకి 9200 క్యూసెక్కుల వరద వచ్చిచేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా, ప్రస్తుతం 1180 అడుగులమేర నీరు ఉంది. 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. అధికారులు 14 గేట్లు ఎత్తి 84,269 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

First Published:  22 July 2023 5:52 AM GMT
Next Story