Telugu Global
Telangana

శాంతించిన గోదావరి.. భద్రాచలం వద్ద తగ్గిన ప్రవాహం

ప్రస్తుతం గోదావరి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇంకా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉండటంతో అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

శాంతించిన గోదావరి.. భద్రాచలం వద్ద తగ్గిన ప్రవాహం
X

ఇటు వర్షాలు తగ్గుముఖం పట్టాయి, అటు ఎగువ నుంచి వస్తున్న గోదావరి ప్రవాహం కూడా కాస్త తగ్గింది. దీంతో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు అధికారులు. గోదావరి ఉధృతి కూడా కాస్త తగ్గింది. భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 52.2 అడుగులకు చేరుకుంది.

ప్రస్తుతం గోదావరి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇంకా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉండటంతో అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వరదల నేపథ్యంలో ఇప్పటికే పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి అక్కడ ఆహారంతోపాటు ఇతర అవసరాలకు సామగ్రిని సమకూర్చారు. గోదావరి ప్రవాహం మరింత అదుపులోకి వస్తే అప్పుడు పునరావాస శిబిరాలనుంచి బాధితులను వెనక్కు పంపిస్తారు.

ప్రాజెక్ట్ లకు జలకళ..

ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు గోదావరి బేసిన్‌ లోని ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తింది. ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో ఇన్‌ ఫ్లో సైతం తగ్గుతోంది. నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుతం శ్రీరాంసాగర్ కు ఇన్‌ ఫ్లో 8,100 క్యూసెక్కులు కాగా, అంతే మొత్తంలో నీటిని బయటకు వదులుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి సైతం ప్రవాహం తగ్గింది. ఇన్‌ ఫ్లో 4800 క్యూసెక్కులు ఉండగా.. అదే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు.

First Published:  30 July 2023 2:07 PM GMT
Next Story