Telugu Global
Telangana

హైదరాబాద్‌లో గ్లాండ్ ఫార్మా రూ.400 కోట్ల పెట్టుబడి : మంత్రి కేటీఆర్

గ్లాండ్ ఫార్మా పెట్టుబడి ద్వారా తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం బలోపేతం కావడమే కాకుండా.. జీనోమ్ వ్యాలీ మరింతగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్‌లో గ్లాండ్ ఫార్మా రూ.400 కోట్ల పెట్టుబడి : మంత్రి కేటీఆర్
X

వరల్డ్ ఫార్మ హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక ప్రతిష్టాత్మక సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే నగరంలో పలు యూనిట్లను నిర్వహిస్తోన్న గ్లాండ్ ఫార్మా.. మరో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. గ్లాండ్ ఫార్మా పెట్టుబడి కారణంగా జీనోమ్ వ్యాలీలో మరో 500 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా బయోలాజికల్స్ ఉత్పత్తి మరింతగా పెరుగనున్నది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో వెల్లడించారు.

గ్లాండ్ ఫార్మా పెట్టుబడి ద్వారా తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం బలోపేతం కావడమే కాకుండా.. జీనోమ్ వ్యాలీ మరింతగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో సంస్థను మరింతగా విస్తరించడానికి నిర్ణయం తీసుకున్నందుకు గ్లాండ్ ఫార్మాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

1978లో హైదరాబాద్‌లో పీవీఎన్ రాజు గ్లాండ్ ఫార్మాను ప్రారంభించారు. మొదట్లో కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరర్‌గా ఉన్న ఈ సంస్థ.. అనతి కాలంలోనే సొంత ఆర్ అండ్ డీని నెలకొల్పి దేశంలోనే జనరిక్ ఇంజెక్టబుల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. ప్రపంచంలోని 60 దేశాలకు గ్లాండ్ ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. చైనాకు చెందిన ఫోసన్ ఫార్మా.. 12 శాతం వాటాను కొనుగోలు చేసిన తర్వాత మరిన్ని ప్రాంతాల్లో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు నెలకొల్పింది.

ఫార్మా, వ్యాక్సిన్ రంగంలో హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. నిన్ననే సీరమ్ ఇన్‌స్టిట్యూట్ నగరంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దేశంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ తయారీదారు హైదరాబాద్‌లో సెంటర్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన 24 గంటల్లోనే మరో సంస్థ రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవడం గమనార్హం. కేవలం ఐటీ రంగంలోనే కాకుండా ఫార్మా రంగంలో పెట్టుబడులకు నగరం అనుకూలంగా ఉండటంతోనే ఆయా సంస్థలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయి.


First Published:  20 Feb 2023 9:42 AM GMT
Next Story