Telugu Global
Telangana

మాకు మైనార్టీ హోదా ఇవ్వండి.. గుజరాతీలు, జైనుల డిమాండ్‌

అన్ని రాష్ట్రాల నుంచి వ‌చ్చి స్థిర‌ప‌డిన వారు హైద‌రాబాద్ మ‌హా న‌గ‌ర ప‌రిధిలో ఉన్నారు. ముఖ్యంగా గుజ‌రాతీలు, రాజ‌స్థానీలు, జైనులు న‌గ‌రంలోని చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌భావవంత‌మైన సంఖ్య‌లో ఉన్నారు.

మాకు మైనార్టీ హోదా ఇవ్వండి.. గుజరాతీలు, జైనుల డిమాండ్‌
X

తెలంగాణ‌లో ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉన్న త‌మ సంక్షేమం ప‌ట్ల రాజ‌కీయ పార్టీలు శీత‌క‌న్నేశాయ‌ని తెలంగాణ గుజరాతీ, జైన్ సంఘాలు ఆరోపించాయి. త‌మ సమస్యలు ప‌రిష్క‌రించి, త‌మ అభివృద్ధికి బాట‌లు వేసే పార్టీలకే అసెంబ్లీ ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని ప్రకటించాయి. బుధవారం కాచిగూడలో నిర్వహించిన దీపావళి స్నేహ సమ్మేళనంలో.. గుజరాతీ, జైన్ సంఘాల ప్రతినిధులు పాల్గొని ఈమేర‌కు తీర్మానం చేశాయి.

రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల మంది

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది గుజరాతీలు, జైనులు ఉన్నారని ఆ సంఘాల నేత‌లు ప్ర‌క‌టించారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే త‌మ సంఖ్య‌ 10 లక్షలు ఉంటుంద‌ని చెప్పారు. త‌మకు మైనార్టీ హోదా కల్పించాల‌ని ఈ సంద‌ర్భంగా విజ్ఞ‌ప్తి చేశారు.

ఎన్నిక‌ల్లో ప్ర‌భావం

అన్ని రాష్ట్రాల నుంచి వ‌చ్చి స్థిర‌ప‌డిన వారు హైద‌రాబాద్ మ‌హా న‌గ‌ర ప‌రిధిలో ఉన్నారు. ముఖ్యంగా గుజ‌రాతీలు, రాజ‌స్థానీలు, జైనులు న‌గ‌రంలోని చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌భావవంత‌మైన సంఖ్య‌లో ఉన్నారు. గోషామ‌హ‌ల్‌, నాంపల్లి, మ‌ల‌క్‌పేట‌ల‌తో ఎల్బీన‌గ‌ర్‌, కుత్బుల్లాపూర్‌, కూక‌ట్‌ప‌ల్లి, మేడ్చ‌ల్‌, మ‌ల్కాజిగిరి, ప‌టాన్‌చెరు త‌దిత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో వీరి సంఖ్య గ‌ణ‌నీయంగా ఉంది. ఇవేకాక క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్‌, వ‌రంగ‌ల్ వంటి జిల్లాల్లోనూ ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వేల మంది ఉన్నారు. వీరి ఓట్ల కోసం రాజ‌కీయ పార్టీలు గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. అయితే అధికార బీఆర్ఎస్ ప్ర‌భుత్వం త‌మ హ‌యాంలో వారి వ్యాపార‌, వ్య‌వ‌హారాల‌కు స‌హ‌కారం అందించామ‌ని, ఆ ఓట్లు త‌మ‌కే ప‌డ‌తాయ‌ని ధీమాగా ఉంది. జాతీయ పార్టీగా త‌మ‌కు అవ‌కాశం ఉంటుంద‌ని బీజేపీ భావిస్తోంది. మ‌రి ఆ ఓట‌ర్ల మ‌ద్ద‌తు ఎవ‌రికో చూడాలి.

First Published:  23 Nov 2023 8:00 AM GMT
Next Story