Telugu Global
Telangana

గ్రూప్-2 పరీక్షపై 14లోగా క్లారిటీ ఇవ్వండి.. టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు ఆదేశం

14లోగా గ్రూప్-2పై ఒక ప్రకటన చేయాలని హైకోర్టు టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

గ్రూప్-2 పరీక్షపై 14లోగా క్లారిటీ ఇవ్వండి.. టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు ఆదేశం
X

గ్రూప్-2 పరీక్ష తేదీలను మార్చాలంటూ కొందరు, అవసరం లేదంటూ మరి కొందరు టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్-2 పరీక్షను మూడు నెలల పాటు వాయిదా వేయాలని కోరుతూ 150 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్-2 పరీక్ష తేదీలపై తగిన నిర్ణయాన్ని ఈ నెల 14 (సోమవారం) లోగా తెలియజేయాలని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ పిటిషన్ వేసిన వారి తరపున కాంగ్రెస్ లీగల్ సెల్ సీనియర్ కౌన్సిల్ గిరిధర్ రావు వాదిస్తూ.. ఆగస్టు 2 నుంచి 30వ తేదీ వరకు 21 రకాల పోటీ పరీక్షలు జరుగుతున్నాయని హైకోర్టుకు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 29, 30న గ్రూప్-2 కూడా నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు గ్రూప్-2 రాయడానికి ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. పిటిషనర్ల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని హైకోర్టును కోరారు.

గ్రూప్-2 కోసం 5.5 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఇందులో 90 శాతం మంది పరీక్షను పోస్ట్‌పోన్ చేయాలని కోరుతున్నట్లు పిటిషనర్ల తరపు న్యాయవాది చెప్పారు. గ్రూప్-2 పరీక్ష రాసే అభ్యర్థులే.. మిగిలిన ఎగ్జామ్స్ కూడా రాస్తున్నట్లు ధర్మాసనం దృష్టికి తీసుకొని వచ్చారు. ఒకే నెలలో ఇన్ని పరీక్షలు నిర్వహిస్తే అభ్యర్థులు మానసిక ఆందోళనకు, ఒత్తిడికి గురవుతారని చెప్పారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డికి పరీక్షలు వాయిదా వేయాలంటూ జూన్, జూలై నెలల్లో రెండు సార్లు వినతి పత్రం ఇచ్చినా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు చెప్పారు.

కాగా, దీనిపై టీఎస్‌పీఎస్సీ తరపున అడ్వొకేట్ గోపాలరావు వాదిస్తూ.. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-2 కోసం 5.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ, గురుకులం పరీక్షకు కేవలం 60 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే గ్రూప్-2 కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. 1,535 సెంటర్లను కూడా ఎంపిక చేశాము. పరీక్షలు జరుగనున్న స్కూల్, కాలేజీలకు సెలవులు ప్రకటించాము. ఈ తేదీ దాటితే భవిష్యత్‌లో మళ్లీ డేట్లు దొరకడం కష్టమవుతుందని హైకోర్టుకు తెలిపారు.

గ్రూప్-2 కోసం ఐదున్నర లక్షల మంది అప్లై చేస్తే.. అందులో 150 మంది మాత్రమే పిటిషన్ వేశారు. అయినా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకొని టీఎస్‌పీఎస్సీ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అయితే 14లోగా గ్రూప్-2పై ఒక ప్రకటన చేయాలని హైకోర్టు టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

First Published:  11 Aug 2023 1:24 PM GMT
Next Story