Telugu Global
Telangana

జీనోమ్ వ్యాలీలో జెనెసిస్ రూ.497 కోట్ల పెట్టుబడి.. కేటీఆర్ సమక్షంలో ప్రకటన

జెనెసిస్ కంపెనీ తమ విస్తరణ ప్రణాళికలు ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తాజాగా మరో 300 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

జీనోమ్ వ్యాలీలో జెనెసిస్ రూ.497 కోట్ల పెట్టుబడి.. కేటీఆర్ సమక్షంలో ప్రకటన
X

తెలంగాణలో ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్న ప్రపంచ దిగ్గజ బయోటెక్ కంపెనీ 'జెనెసిస్' విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో గతంలో రూ.415 కోట్ల పెట్టుబడి పెట్టిన ఆ సంస్థ.. మరో రూ.497 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు వెల్లడించింది. ఇక్కడ రీకాంబినెట్ బల్క్ మాన్యుఫ్యాక్ఛరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. ఈ మేరకు అమెరికాలో మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశం అనంతరం కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

కాగా, జెనెసిస్ కంపెనీ తమ విస్తరణ ప్రణాళికలు ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తాజాగా మరో 300 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అమెరికాకు చెందిన సివికా ఆర్ఎక్స్ అనే కంపెనీ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో కంపెనీ విస్తరణ చేపట్టనున్నది. ఇప్పటికే తెలంగాణలో బయోటెక్ రంగంలో ఎంతో అభివృద్ధి జరుగుతోంది. జెనెసిస్ వంటి కంపెనీల విస్తరణతో దీనికి మరింత ఊతం లభిస్తుందని కేటీఆర్ అన్నారు.

ఈ రెండు కంపెనీలు ఇన్సులిన్ తయారీలో ముందున్నాయి. అతి తక్కువ ధరకు ఇన్సులిన్ అందిస్తూ డయాబెటిక్ పేషెంట్లకు తోడ్పాటును అందిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న జెనెసిస్ ఒక బయోఫార్మాస్యూటికల్ కంపెనీ. ఇది అత్యంత నాణ్యమైన, సరసమైన ధరలకుదొరికే మెడిసిన్‌ను ఉత్పత్తి చేస్తోంది. జెనెసిస్ క్యాటలాగ్‌లో ఇన్సులిన్ కీలకంగా ఉన్నది. ప్రస్తుతం 250 మంది ఉద్యోగులు పని చేస్తుండగా.. విస్తరణ అనంతరం మరో 300 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

జెనెసిస్ సంస్థ యూఎస్‌కు చెందిన నాన్ ప్రాఫిట్ జెనెరిక్ డ్రగ్ కంపెనీ అయిన సివికా ఆర్ఎక్స్ అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నది. ఈ సంస్థ ఇన్సులిన్ మాన్యుప్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. రోగులకు అందుబాటు ధరల్లో ఉండే మందులను ఉత్పత్తి చేయడం ఈ సంస్థ లక్ష్యం.


First Published:  20 May 2023 1:26 AM GMT
Next Story