Telugu Global
Telangana

ఎల్లుండి ప్రధాని ప్రారంభించబోయే రామగుండం ఫ్యాక్టరీ లో గ్యాస్ లీక్‌

ఎల్లుండి ప్రధాని ప్రారంభించబోయే రామగుండం ఫ్యాక్టరీ లో గ్యాస్ లీక్‌
X

పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ(ఆర్‌‌ఎఫ్‌సీఎల్‌)లో అమ్మోనియం ప్లాంట్ గ్యాస్ లీక్ అవ‌డంతో బుధవారం యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ రోజు మరమ్మతులు చేసి ఉత్పత్తిని తిరిగి ప్రాంభించామని అధికారులు తెలిపారు.

కాగా రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడానికి శ‌నివారంనాడు (ఈనెల 12) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రామగుండం రానున్నారు. ప్రధాని పర్యటన ముందు గ్యాస్ లీక్ అవడం చర్చనీయంశంగా మారింది.

ఈ ఫ్యాక్టరీ ఏడాదిన్నర క్రితమే ఉత్పత్తి ప్రారంభించినప్పటికీ అనేక రిపేర్లతో ఫ్యాక్టరీ ఆగిపోయి ఆరు నెలల క్రితం ఉత్పత్తి నిలిచిపోయింది. అప్పటి నుంచి దాని మరమ్మతుల గురించి కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. ఎల్లుండి మోడీ రానుండటం స్థానిక అధికారులు చొరవ చేసి మిషనరీకి రిపేర్లు చేసి నిన్నటి నుంచే నడిపిస్తున్నారు. ఇంతలోనే ఇవ్వాళ్ళ మళ్ళీ అమ్మోనియం ప్లాంట్ గ్యాస్ లీక్ అయ్యింది.

అయితే ఇలా గ్యాస్ లీక్ అవడం అనేది ఈ ఫ్యాక్టరీ లో పరిపాటిగా మారిందని, ఏడాదిన్నర పాటు ఫ్యాక్టరీ నడిస్తే దాదాపు ఏడెనిమిది సార్లు గ్యాస్ లీక్ అయ్యిందని స్థానికులు చెప్తున్నారు. అధికారులు మాత్రం గ్యాస్ లీక్ గురించి ఒకే ఒక సారి తప్ప ఎన్నడూ ప్రకటించలేదు. లీకేజీలను అరికట్టే విషయంలో అధికారులు ఏ మాత్రం శ్రద్ద చూపడం లేదని స్థానికులు వాపోతున్నారు. తమ ప్రాణాలతో ఫ్యాక్టరీ అధికారులు చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు.

ఇక రెండు నెలల తర్వాత తిరిగి ప్రారంభించగానే ఈ సారి కూడా మళ్ళీ గ్యాస్ లీకయ్యింది. అయితే అధికారులు వెంటనే మిషనరీ ఆపి గ్యాస్ లీక్ ను అరికట్టినట్టు సమాచారం. మరి ఎల్లుండి ప్రధాని వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందనే భయం అధికారుల్లో ఉంది.

First Published:  10 Nov 2022 10:54 AM GMT
Next Story