Telugu Global
Telangana

చిక్కుల్లో గరికపాటి - పాత వీడియోలు వైరల్

మహిళల వస్త్రధారణ మూలంగానే వారిపై అత్యాచారాలు జరుగుతున్నాయంటూ.. గరికపాటి గతంలో చాలాసార్లు వ్యాఖ్యానించారు. ఆయన అనేక సందర్భాల్లో యువతులు వేసుకొనే టీషర్టులు, బ్లౌజులపై వివాదాస్పదంగా మాట్లాడారు.

చిక్కుల్లో గరికపాటి - పాత వీడియోలు వైరల్
X

ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహరావుపై ఇటీవల తీవ్ర దుమారం రేగుతోంది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ నిర్వహించిన అలయ్.. బలయ్ కార్యక్రమంలో ఆయన వ్యవహరించిన తీరు చిరంజీవి అభిమానులకు కోపం తెప్పించింది. ఇక ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ వరసగా ఆయన వీడియోలపై సెటైర్లు వేశారు. ఇలా ఆయన పాత వీడియాలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన గతంలో వివిధ సందర్భాల్లో మహిళలపై చేసిన వ్యాఖ్యలను తాజాగా కొందరు తెరమీదకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఓ మహిళా జర్నలిస్టు ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.

మహిళల వస్త్రధారణ మూలంగానే వారిపై అత్యాచారాలు జరుగుతున్నాయంటూ.. గరికపాటి గతంలో వ్యాఖ్యానించారు. ఆయన అనేక సందర్భాల్లో యువతులు వేసుకొనే టీషర్టులు, బ్లౌజులపై వివాదాస్పదంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై సదరు మహిళా జర్నలిస్టు గట్టిగా కౌంటర్లు ఇచ్చారు. ప్రముఖ హేతువాది బాబు గోగినేని సహా.. పలువురు జర్నలిస్టులు సైతం ఆయన వీడియోలను షేర్ చేస్తున్నారు. మహిళలపై గరికపాటి చేసిన వ్యాఖ్యలపై మహిళలతో సహా, పలువురు ప్రముఖులు, రాజకీయనేతలు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గరికపాటి వ్యాఖ్యలపై తాజాగా బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరచినందుకు గరికపాటి అనే పురుషాహంకారి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. ఇలాంటి స్త్రీలను ద్వేషించే వ్యక్తులను తెలుగు సమాజం, మీడియా బహిష్కరించాలని ఆర్ఎస్పీ అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా గరికపాటి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.

గతంలో చిన్న జియర్ స్వామి కూడా ఇలాగే వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. మాంసం తినేవారిని ఉద్దేశించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం రేగాయి. చివరకు ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదంపై గరికపాటి ఎలా స్పందిస్తారో.. వేచి చూడాలి.

First Published:  13 Nov 2022 3:45 PM GMT
Next Story