Telugu Global
Telangana

హైదరాబాద్‌లో చెత్తకుప్పలు.. మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంటింటి చెత్త సేకరణ కోసం అప్పటి వరకు ఉన్న రిక్షాలను తొలగించి.. ట్రాలీ ఆటోలను ప్రవేశపెట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలో 4,500 చెత్త సేకరణ ఆటోలు ఉన్నాయి.

హైదరాబాద్‌లో చెత్తకుప్పలు.. మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు
X

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ కొన్ని చొట్ల చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో రోజుకు 7వేల నుంచి 7500 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. అయినా సరే నగర వ్యాప్తంగా 2,500 టన్నుల మేర చెత్త కుప్పలు ఏర్పడుతున్నాయి. ఇవి ఆషామాషీ లెక్కలు కావు. ఇటీవల అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేతో ఈ వివరాలు వెల్లడయ్యాయి. నగరంలో చెత్త కుప్పలు పేరుకొని పోవడంపై మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో చెత్త సేకరణకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తున్నది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంటింటి చెత్త సేకరణ కోసం అప్పటి వరకు ఉన్న రిక్షాలను తొలగించి.. ట్రాలీ ఆటోలను ప్రవేశపెట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలో 4,500 చెత్త సేకరణ ఆటోలు ఉన్నాయి. నగరంలో సగటున 650 ఇళ్లకు ఒక ఆటో పని చేస్తోంది. కాగా, ఆయా ప్రాంతాలకు కేటాయించిన స్వచ్ఛ ఆటోలు సగం ఇళ్లకు నిత్యం వెళ్లడం లేదని తెలుస్తున్నది. కొన్ని ఆటోలు రోజుకు 200.. మరికొన్ని ఆటోలు 300 ఇళ్ల నుంచి చెత్తను సేకరిస్తున్నాయి. నగరంలో 22 లక్షల ఇళ్లు ఉండగా.. ఒక రోజుకు 10 లక్షల ఇళ్ల నుంచి చెత్తను సేకరిస్తున్నాయి. రోజుకు కనీసం 3 ట్రిప్పులు తిరగాల్సి ఉండగా.. సగటున ఒకటిర్నర ట్రిప్పులే తిరుగుతున్నాయి. దీంతో నగరంలో పలు ప్రాంతాల్లో చెత్త పేరుకొని పోతోంది.

ఆస్కి సర్వే ద్వారా నగరంలో చెత్త సేకరణ పరిస్థితిని తెలుసుకున్న మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రతీ ఇంటికి.. ప్రతీ రోజు ఆటోలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ క్షేత్ర స్థాయి సర్వే చేపడుతున్నారు. ప్రస్తుత పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల సర్వే జరుగుతోంది. ఆ సర్వేతో పాటే ఇంటింటికి నిత్యం చెత్త ఆటోలు వస్తున్నాయా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అంతే కాకుండా రోజుకు ఎన్ని ఇళ్లకు చెత్త ఆటోలు వెళ్తున్నాయో లెక్కలు చెప్పాలని రొనాల్డ్‌రాస్ పేర్కొన్నారు.

క్షేత్ర స్థాయి సిబ్బంది నుంచి పూర్తి స్థాయిలో లెక్కలు రాగానే.. ఎక్కడెక్కడ చెత్త సేకరణ ఆటోలు వెళ్లడం లేదో అక్కడ చర్యలు తీసుకోనున్నారు. నగరంలో చెత్తకుప్పలు కనపడకుండా కఠిన చర్యలు తీసుకోవడానికి జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం 600పైగా ఇళ్లకు ఒక ఆటో ఉండగా.. ఇకపై 500 ఇళ్లకు ఒక ఆటోను ఏర్పాటు చేయనున్నారు. అవసరం అయితే కొత్త ఆటోల కొనుగోళ్లు కూడా చేపట్టనున్నట్లు తెలుస్తున్నది.

First Published:  24 Sep 2023 3:29 AM GMT
Next Story