Telugu Global
Telangana

గజ్వేల్ లో కేసీఆర్ భారీ మెజార్టీకోసం హరీష్ రావు ఏం చేస్తున్నారంటే..?

గజ్వేల్ లో బీజేపీ తరపున ఈటల రాజేందర్ పోటీ చేయబోతున్నారు. ముదిరాజ్ ఓట్లపై ఈటల ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో గజ్వేల్ లో కేసీఆర్ మెజార్టీ పెరగడం, ఈటలకు డిపాజిట్ గల్లంతు కావడం అనే రెండు అంశాలు బీఆర్ఎస్ కి ప్రతిష్టాత్మకంగా మారాయి

గజ్వేల్ లో కేసీఆర్ భారీ మెజార్టీకోసం హరీష్ రావు ఏం చేస్తున్నారంటే..?
X

2018 గజ్వేల్ లో సీఎం కేసీఆర్ కి వచ్చిన మెజార్టీ 58,290

ఈసారి మెజార్టీ మరింత పెంచే టార్గెట్ పెట్టుకున్నారు మంత్రి హరీష్ రావు. గజ్వేల్ నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. తాజాగా ఆయన ఆర్అండ్ఆర్ కాలనీలో నేతలు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ ని ఈ సారి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని, హ్యాట్రిక్ సీఎంని చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆయా పార్టీలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, మనకు పెద్ద దిక్కుగా ఉన్న కేసీఆర్ ని మరోసారి సీఎంని చేసుకోవాలని చెప్పారు హరీష్.

ఈసారి కీలకం..

ఈ దఫా గజ్వేల్ తో పాటు, సీఎం కేసీఆర్ కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారు. అంటే రెండు నియోజకవర్గాల్లోనూ ఆయన పర్యటించాల్సి ఉంటుంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ విరామం లేకుండా ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో గజ్వేల్ పై హరీష్ రావు దృష్టిసారించారు. అదే సమయంలో గజ్వేల్ లో బీజేపీ తరపున ఈటల రాజేందర్ పోటీ చేయబోతున్నారు. ముదిరాజ్ ఓట్లపై ఈటల ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో గజ్వేల్ లో కేసీఆర్ మెజార్టీ పెరగడం, ఈటలకు డిపాజిట్ గల్లంతు కావడం అనే రెండు అంశాలు బీఆర్ఎస్ కి ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో ఈ నియోజకవర్గంపై నేతలు దృష్టిసారించారు.

గజ్వేల్ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన మంత్రి హరీష్ రావు.. ఆ ప్రాంతానికి జరిగిన మేలుని వివరించారు. భవిష్యత్ లో మరింత అభివృద్ధికి అవకాశం ఉందని చెప్పారు. గజ్వేల్‌ పట్టణ అభివృద్ధికి బృహత్‌ ప్రణాళిక ఉందని వెల్లడించారు. కేసీఆర్‌, గజ్వేల్‌ రూపురేఖలు మార్చారని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారని అన్నారు. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను గడప గడపకు తీసుకెళ్లాలని హరీష్ రావు.. నేతలకు పిలుపునిచ్చారు. గజ్వేల్‌ లో లక్షకుపైగా మెజారిటీతో కేసీఆర్‌ ను గెలిపించుకుంటామని ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు చెప్పడం గమనార్హం.

First Published:  1 Nov 2023 2:16 AM GMT
Next Story