Telugu Global
Telangana

అన్నంత పని చేసిన పాల్.. మునుగోడు బరిలో గద్దర్

తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు గద్దర్. రాజ్యాంగ పరిరక్షణ కోసమే తాను మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నట్టు తెలిపారు.

అన్నంత పని చేసిన పాల్.. మునుగోడు బరిలో గద్దర్
X

కేఏ పాల్ అన్నంత పని చేశారు. మునుగోడులో సత్తా చూపిస్తానంటూ ముందునుంచీ హడావిడి చేస్తున్న పాల్, ఎన్నికల షెడ్యూల్ రావడంతోనే అభ్యర్థిని ప్రకటించారు. మునుగోడులో ప్రజాశాంతి పార్టీ తరపున ప్రజా గాయకుడు గద్దర్ పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. ప్రజా గాయకుడుగా పేరున్నా, రాజకీయాలకు దగ్గరగా ఉన్నా, ఉద్యమాల్లో పాల్గొన్నా.. గద్దర్ ఇప్పటి వరకూ నేరుగా రాజకీయాల్లో వేలు పెట్టలేదు. కానీ ఈసారి ఎందుకో ఆయన పాల్ బుట్టలో పడ్డారు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. రాజ్యాంగ పరిరక్షణకోసమే తాను మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నట్టు తెలిపారు గద్దర్.

ఇటీవల మునుగోడులో సభ పెట్టిన కేఏ పాల్, గద్దర్ ని కూడా పక్కన కూర్చోబెట్టుకున్నారు. పైగా గద్దర్, పాల్ గురించి గొప్పగా చెప్పారు. అప్పుడే అనుమానం మొదలైంది, ఇప్పుడది బలపడింది. గద్దర్ ని బరిలో దింపిన పాల్, ఓట్లను చీల్చే పని మొదలు పెట్టారు. అయితే గద్దర్ పోటీతో ప్రధాన పార్టీల్లో ఎవరి ఓట్లకు కోత పడుతుందనేది మాత్రం తేలాల్సి ఉంది. ఇంతకీ గద్దర్ ని బరిలో దింపుతున్న పాల్, పోలింగ్ వరకు మాటపై నిలబడతారా, లేక సడన్ గా ప్లేటు ఫిరాయిస్తారా అనేది తేలాల్సి ఉంది.

సరిగ్గా నెలరోజులు..

మునుగోడు ఉప ఎన్నికకు ఇంకా నెలరోజుల టైమ్ ఉంది. నవంబర్ 3న పోలింగ్, సరిగ్గా వచ్చే నెల ఇదే తేదీన, నవంబర్-6 ఫలితాలు వెలువడతాయి. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచార జోరు పెంచింది. టీఆర్ఎస్ మాత్రం అధికారికంగా ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రస్తుతానికి చేరికలతో బలం పెంచుకుంటోంది. బీఆర్ఎస్ ప్రకటన కూడా పూర్తయింది కాబట్టి.. ఇప్పుడు మునుగోడుపై కేసీఆర్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతారు. మునుగోడులో ఏ పార్టీని గెలుపు వరిస్తుందో.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎన్నికలను ఎదుర్కొంటుంది. అందుకే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇక్కడ విజయం కోసం శ్రమిస్తున్నాయి. మధ్యలో పాల్ వచ్చి గద్దర్ పేరుతో లొల్లి పెట్టారు.

First Published:  6 Oct 2022 2:40 AM GMT
Next Story