Telugu Global
Telangana

గొంగడి తీసి ఖద్దర్‌ వేయనున్న గద్దర్‌

ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ముందు కొత్త పార్టీ రిజిస్ట్రేషన్‌ కోసం వెళ్లారు. అప్లికేషన్‌తో పాటు సమర్పించాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లను కూడా తీసుకెళ్లారు.

గొంగడి తీసి ఖద్దర్‌ వేయనున్న గద్దర్‌
X

గద్దర్‌.. ఒకనాడు తెలుగు సమాజాన్ని ఉర్రూతలూగించిన పేరు ఇది. విప్లవ రాజకీయాల ప్రచారంలో భాగంగా లక్షలాది మందిని కదిలించిన గళం ఆయనది. ఆయన గొంతెత్తితే పసి పిల్లల నుంచి పండు ముసలి వరకు ఎవరైనా చలించాల్సిందే. ఆవేశంతో రగిలిపోవాల్సిందే. అది ప్రజలు అందించిన వారసత్వం ఆయనకు. ప్రజా గాయకుడిగా దశాబ్దాల ప్రస్తానానికి తెరదించి.. ఎన్నికల బాటపట్టారు గ‌ద్ద‌ర్‌. ఇప్పుడు ఏకంగా రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారు.

భూస్వామ్యానికి, శ్రమ దోపిడీకి పాల్పడే పెట్టుబడికి వ్యతిరేకంగా ఆయన వేలాది పాటలు పాడారు. పాటను ఆయుధంగా మలిచి ప్రజలను ఉద్యన్మోఖుల్ని చేశారు. కానీ.. ఇది నిన్నటి ముచ్చట. ఇప్పుడాయన రూటు మార్చారు. ఎన్నికల రాజకీయాల పట్ల తన అభిప్రాయాన్ని మార్చుకున్న గద్దర్‌.. పలు రాజకీయ పార్టీల వేదికపై పాటలు పాడేందుకు పరిమితమయ్యారు. ఆ పార్టీ, ఈ పార్టీ అనకుండా అందరికీ చేరువయ్యే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విమర్శలూ ఎదుర్కొన్నారు. అయినా.. తాను వెళ్లాలనుకున్న దారి పట్ల క్లారిటీ ఉన్నట్లే వ్యవహరించారు. ఇప్పుడా దారి ఒక మలుపు తీసుకుంది. సొంత పార్టీని ప్రకటించారు.

గద్దర్ ప్రజా పార్టీ పేరుతో నూతన రాజకీయ పార్టీని రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ముందు కొత్త పార్టీ రిజిస్ట్రేషన్‌ కోసం వెళ్లారు. అప్లికేషన్‌తో పాటు సమర్పించాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లను కూడా తీసుకెళ్లారు. ఎన్నికల సంఘంలో దరఖాస్తుకు ముందు జరగాల్సిన ప్రక్రియను కూడా ఇప్పటికే పూర్తిచేసినట్లు తెలుస్తోంది. నిబంధనావళిని కూడా సిద్ధం చేశారట. కొత్త పార్టీ తరఫున తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలనుకుంటున్నారు గద్దర్‌.

కొంత కాలంగా కాంగ్రెస్ వేదికలపై కనిపిస్తున్న గద్దర్‌.. గతంలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీతోనూ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో గద్దర్‌ కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరిగింది. కానీ, ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ సొంత పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. నూతన పార్టీ దరఖాస్తును ఎన్నికల కమిషన్ అధికారులు స్క్రూటినీ చేయడానికి వారం రోజుల వ్యవధి తీసుకుని ఆ తర్వాత పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని సూచిస్తుంది. పార్టీ పేరు పట్ల ఎవరికైనా అభ్యంతరాలుంటే రాతపూర్వకంగా తెలిపేందుకు నెలరోజుల గడువు ఇస్తుంది ఎన్నికల కమిషన్‌. ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రానట్లయితే పార్టీని అధికారికంగా గుర్తిస్తుంది. రాజకీయ నేతగా అవతారం మార్చుకుంటున్న ఈ ప్రజా గాయకుడిని జనం ఎంతమేరకు ఆదరిస్తారో చూడాలి మరి.

First Published:  21 Jun 2023 6:58 AM GMT
Next Story