Telugu Global
Telangana

కన్యాకుమారి నుండి ఢిల్లీకి: హైదరాబాద్ చేరిన రైతుల యాత్ర

తెలంగాణలో అమలు చేస్తున్న విధంగా రైతు బంధు, రైతు బీమా, నిరంతర విద్యుత్‌, రైతులకు నీటి సరఫరా వంటి రైతు సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కన్యాకుమారి నుండి ఢిల్లీకి: హైదరాబాద్ చేరిన రైతుల యాత్ర
X

ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కన్యాకుమారి నుంచి ఢిల్లీకి రైతులు యాత్ర చేపట్టారు.

తెలంగాణలో అమలు చేస్తున్న విధంగా రైతు బంధు, రైతు బీమా, నిరంతర విద్యుత్‌, రైతులకు నీటి సరఫరా వంటి రైతు సంక్షేమ పథకాలను కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు..

తమ డిమాండ్లకు బీజేపీ యేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతు కోరే ప్రయత్నాల్లో భాగంగా రైతు బృందం హైదరాబాద్‌కు చేరుకుంది.

తమిళనాడు రైతు సంఘాల సమన్వయ కమిటీ (తమిళనాడు అనైతు వివసాయిగల్ సంగంగాలిన్ ఒరుంగినైప్పు కుజు) నేతృత్వంలో మార్చి 2న కన్యాకుమారి నుంచి ''న్యాయం కోసం సుధీర్ఘ యాత్ర'' పేరుతో ఈ యాత్ర‌ ప్రారంభమైంది.

వ్యవసాయోత్పత్తులకు లాభదాయకమైన ఎంఎస్‌పిని అందించే బిల్లు, జన్యుమార్పిడి పంటలపై నిషేధం, వ్యవసాయ రుణాల రద్దు, పశ్చిమ కనుమలు, జలవనరుల పరిరక్షణకు చర్యలు, రైతు ఉద్యమం సందర్భంగా నిరసనకారులపై పెట్టిన కేసుల ఉపసంహరణ, వ్యవసాయం , వ్యవసాయ మార్కెటింగ్‌లో పాల్గొనకుండా కార్పొరేట్ కంపెనీలపై నిషేధం, చిన్న రైతులు, స్థానిక వ్యాపారులు, చిన్న వ్యాపార యజమానులకు సేంద్రీయ వ్యవసాయ ఇన్‌పుట్‌లను అందించడం తదితర అంశాలపై చట్టాన్ని ప్రవేశపెట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

కన్యాకుమారి నుంచి బయలు దేరిన రైతు కమిటీ బృందం హైదరాబాద్ చేరుకొని రైతు బంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కలిశారు. సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకులు శివకుమార్‌ కక్కాజీ, పంజాబ్‌ నుంచి బల్‌దేవ్‌ సింగ్‌, తమిళనాడు మహిళా రైతు నాయకురాలు సుధా ధర్మలింగం, తెలంగాణ రైతు నాయకుడు కోటపాటి నరసింహా నాయుడు తదితరులు రాజేశ్వర్ రెడ్డితో సమావేశమయ్యారు. రైతు సమన్వయ సమితి లేవనెత్తిన సమస్యలను బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని రైతు బంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.

న్యాయమైన డిమాండ్లతో రైతులు చేస్తున్న పోరాటానికి తెలంగాణలోని రైతు సంఘాలు, రైతు బంధు సమితిల తరపున మద్దతు తెలిపారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం పూర్తిగా రద్దు చేసి, ఎంఎస్‌పీ నిబంధనలకు చట్టబద్ధత కల్పించే వరకు రైతుల పక్షాన బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగుతుందన్నారు.

First Published:  7 March 2023 3:01 AM GMT
Next Story