Telugu Global
Telangana

నిమ్స్ లో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు

‘హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌ చార్లీస్‌ హార్ట్‌ హీరోస్‌ క్యాంప్‌’లో భాగంగా ఉచిత శస్త్రచికిత్సలు జరగుతాయని తెలిపారు అధికారులు. చిన్నారులకు ఆపరేషన్లు అవసరమైన తల్లిదండ్రులు మరిన్ని వివరాలకోసం 040–23489025 నెంబర్‌ లో సంప్రదించాలని సూచించారు.

నిమ్స్ లో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు
X

గుండె సమస్యలతో బాధపడే చిన్నారులకు హైదరాబాద్ లోని నిమ్స్‌ ఆస్పత్రిలో లో ఈ నెల 24 నుంచి 30వరకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహించబోతున్నారు. ఈమేరకు ఆస్పత్రి డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ నగరి బీరప్ప ఓ ప్రకటనలో తెలిపారు. అప్పుడే పుట్టిన బిడ్డలనుంచి ఐదేళ్లలోపు చిన్నారుల గుండె వ్యాధులకు చికిత్స అందిస్తామని చెప్పారు.

బ్రిటన్ ఆస్పత్రి సహకారంతో..

బ్రిటన్‌ లోని ఆల్డర్‌ హే చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ కార్డియాక్‌ సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ రమణ దన్నపునేని ఆధ్వర్యంలోని 10 మంది సర్జన్ల బృందం నిమ్స్ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్లు చేసేందుకు సిద్ధమైంది. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. నీలోఫర్‌ ఆస్పత్రి సర్జన్లు, నిమ్స్‌ కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్‌ అమరేశ్వరరావు, ఇతర వైద్య బృందంతో కలసి నిమ్స్‌లో శస్త్రచికిత్సలు చేపడతారు.

‘హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌ చార్లీస్‌ హార్ట్‌ హీరోస్‌ క్యాంప్‌’లో భాగంగా ఉచిత శస్త్రచికిత్సలు జరగుతాయని తెలిపారు అధికారులు. చిన్నారులకు ఆపరేషన్లు అవసరమైన తల్లిదండ్రులు మరిన్ని వివరాలకోసం 040–23489025 నెంబర్‌ లో సంప్రదించాలని సూచించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఈ ఫోన్ నెంబర్ కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవాలని, ఈ ఉచిత క్యాంప్ ని అవసరం ఉన్నవారు ఉపయోగించుకోవాలని సూచించారు.

ఇటీవలే నిమ్స్ ఆస్పత్రి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ లో రికార్డు సృష్టించి వార్తల్లో నిలిచింది. 8 నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిమ్స్ లో జరిగాయి. ఇటీవల నెదర్లాండ్స్ ప్రభుత్వం కూడా నిమ్స్ ఆస్పత్రిలో అందుతున్న సేవలను గుర్తించి కొనియాడింది. ఆదేశ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జాన్ కైపర్స్.. నిమ్స్ ఆస్పత్రిని సందర్శించి ఇక్కడ అందుతున్న సేవలను మెచ్చుకున్నారు. ఇక నిమ్స్ ఆస్పత్రి విస్తరణ కార్యక్రమాలు కూడా ఇటీవలే మొదలయ్యాయి. నిమ్స్ లో 2వేల పడకల నూతన బిల్డింగ్ కోసం సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నూతన బిల్డింగ్ అందుబాటులోకి వస్తే నిమ్స్ లో వైద్య సౌకర్యాలు మరింతమందికి అందుబాటులోకి వస్తాయి.

First Published:  11 Sep 2023 4:41 AM GMT
Next Story