Telugu Global
Telangana

మహిళా జర్నలిస్టులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు : తెలంగాణ సీఎస్ శాంతికుమారి

హైదరాబాద్‌లోని సమాచార కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌ను శాంతి కుమారి ప్రారంభించారు.

మహిళా జర్నలిస్టులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు : తెలంగాణ సీఎస్ శాంతికుమారి
X

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళ జర్నలిస్టులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు అందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగానే జర్నలిస్టులకు కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చి దిద్దాలని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. బుధవారం నుంచి ఏప్రిల్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు సీఎస్ వెల్లడించారు.

హైదరాబాద్‌లోని సమాచార కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌ను శాంతి కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ మెడికల్ క్యాంపుల్లో 36 రకాలైన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉచిత ఆరోగ్య పరీక్షల వల్ల మహిళలకు ఆర్థిక భారం కలుగకుండా చూస్తామని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె చెప్పారు. ఇప్పటికే సీఎం కేసీఆర్.. తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ కిట్, కంటి వెలుగు, ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల వల్ల మాతాశిశు మరణాలు తెలంగాణలో తగ్గాయని ఆమె పేర్కొన్నారు.

కంటి వెలుగు మొదటి దశలో కోటిన్నర మందికి ఉచిత కంటి పరీక్షలు చేశామని, 45 లక్షల మందికి కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఇక రెండో దశలో కోటీ 70 లక్షల మందికి కంటి పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మహిళ జర్నలిస్టులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం రోజు మంత్రి కేటీఆర్ సూచించిన విషయాన్ని ఆమె గుర్తి చేశారు. అక్రిడిటెడ్ మహిళ జర్నలిస్టుల కోసం మసాబ్ ట్యాంక్‌లోని సమాచార భవన్‌లో 10 రోజుల పాటు మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

పది రోజుల పాటు నిర్వహించే ఈ క్యాంపు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేస్తుందని చెప్పారు. రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన వారితో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన జర్నలిస్టులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. మాస్టర్ హెల్త్ చెకప్‌లో భాగంగా సీబీపీ, బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ బీ12, విటమిన్ డీ3, ఈసీజీ, ఎక్స్‌రే, అల్ట్రాసోనోగ్రాఫి. ఐ స్క్రీనింగ్, డెంటల్, గైనకాలజీ పరీక్షలు అందుబాటులో ఉంటాయని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ చెప్పారు.

First Published:  29 March 2023 7:50 AM GMT
Next Story