Telugu Global
Telangana

కొడకండ్ల మినీ టెక్స్‌టైల్ పార్కుకు త్వరలోనే శంకుస్థాపన : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

మినీ టెక్స్‌టైల్ పార్కుకు అన్ని రకాల అనుమతులు వచ్చాయని, భూసేకరణ కూడా పూర్తయినట్లు మంత్రి చెప్పారు.

కొడకండ్ల మినీ టెక్స్‌టైల్ పార్కుకు త్వరలోనే శంకుస్థాపన : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
X

జనగామ జిల్లా కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్ పార్కుకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు, మంత్రి కేటీఆర్ సహకారంతో పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్లలో ఈ మినీ టెక్స్‌టైల్ పార్కు రాబోతోందని మంత్రి చెప్పారు. ఇందుకు గాను సిరిసిల్ల మోడల్‌లో గ్రౌండింగ్‌కు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

కొడకండ్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో చేనేత కార్మికులు అధికంగా ఉన్నారు. వీళ్లందరూ ముంబై, భీవండి, సూరత్ వంటి ప్రాంతాలకు వలస వెళ్తున్నట్లు దయాకర్ రావు తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగినట్లుగానే.. చేనేత రంగంలో కూడా మార్పులు రావల్సిన అవసరం ఉన్నది.ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొని వెళ్లగా కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారని మంత్రి దయాకర్ రావు తెలిపారు.

మినీ టెక్స్‌టైల్ పార్కుకు అన్ని రకాల అనుమతులు వచ్చాయని, భూసేకరణ కూడా పూర్తయినట్లు మంత్రి చెప్పారు. సిరిసిల్ల మోడల్‌లో పార్క్‌ను ఏర్పాటు చేసి.. అందుబాటులో ఉండే కార్మికులకు వాటిని సాధ్యమైనంత తక్కువకు కేటాయించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

20 వేల మందికి ఉపాధి..

వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌లో దాదాపు 20వేల మందికి సమీప భవిష్యత్‌లో ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే అక్కడకు చాలా కంపెనీలు వచ్చాయని, ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను కూడా ప్రారంభించాయని మంత్రి దయాకర్ రావు తెలిపారు. ఇక్కడ కంపెనీలు తమకు అవసరమైన ఉద్యోగులను కూడా నియమించుకొని ఉపాధి కల్పించాయని చెప్పారు. ఈ పార్కులో కుట్టు శిక్షణ పూర్తి చేసిన వారికి మంచి అవకాశాలు ఉన్నాయని తెలిసి.. పాలకుర్తి నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా 1000 మందికి రెండు విడతల్లో శిక్షణ ఇచ్చామని చెప్పారు.

అర్హులైన వారికి అక్టోబర్ నెలలోగా వరంగల్ టెక్స్‌టైల్ పార్కులో దశల వారీగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి చెప్పారు. గురుకుల పాఠశాలలు, హాస్టల్ విద్యార్థులకు అవసరమయ్యే యూనిఫామ్స్ ఆర్డర్లు ఇక్కడి కంపెనీలకు అప్పగించాలని ఆయా ప్రభుత్వ శాఖలకు లేఖలు రాయనున్నట్లు మంత్రి దయాకర్ రావు వెల్లడించారు.

First Published:  18 May 2023 3:53 PM GMT
Next Story