Telugu Global
Telangana

సీతాద‌యాక‌ర్‌రెడ్డి.. రాజ‌కీయ అడుగులు ఎటువైపు..?

కొంత‌కాలంగా రాజ‌కీయంగా స్త‌బ్దుగా ఉన్న సీతాద‌యాక‌ర్‌రెడ్డి శుక్ర‌వారం నారాయ‌ణ‌పేట జిల్లా మ‌క్త‌ల్‌లో భ‌ర్త ద‌యాక‌ర్‌రెడ్డి వ‌ర్ధంతి సంద‌ర్భంగా నోరు విప్పారు.

సీతాద‌యాక‌ర్‌రెడ్డి.. రాజ‌కీయ అడుగులు ఎటువైపు..?
X

సీతాద‌యాక‌ర్‌రెడ్డి.. ఉమ్మ‌డి మ‌హబూబ్‌న‌గ‌ర్ జిల్లాలో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత కొత్త‌కోట ద‌యాక‌ర్‌రెడ్డి భార్య‌గా, ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా జ‌డ్పీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా ఆమె జిల్లా ప్ర‌జ‌లంద‌రికీ సుప‌రిచితం. రాష్ట్రవ్యాప్తంగా రాజ‌కీయ వ‌ర్గాలంద‌రికీ కూడా తెలుసు. కొంత‌కాలంగా రాజ‌కీయంగా స్త‌బ్దుగా ఉన్న సీతాద‌యాక‌ర్‌రెడ్డి శుక్ర‌వారం నారాయ‌ణ‌పేట జిల్లా మ‌క్త‌ల్‌లో భ‌ర్త ద‌యాక‌ర్‌రెడ్డి వ‌ర్ధంతి సంద‌ర్భంగా నోరు విప్పారు. సరైన రాజ‌కీయ వేదిక కోసం చూస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు.

జ‌డ్పీ ఛైర్‌ప‌ర్స‌న్‌, ఎమ్మెల్యే

ఎంఏ సోషియాల‌జీ చ‌దివిన సీత.. ద‌యాక‌ర్‌రెడ్డిని వివాహం చేసుకున్నాక భ‌ర్త‌తో పాటు రాజ‌కీయ రంగంలోకి వ‌చ్చారు. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో టీడీపీని న‌డిపించిన ద‌యాక‌ర్‌రెడ్డి.. భార్య‌ను 2002లో జ‌డ్పీటీసీగా గెలిపించి, జ‌డ్పీ ఛైర్‌ప‌ర్స‌న్‌ను చేయించుకోగ‌లిగారు. త‌ర్వాత కొత్త‌గా ఏర్ప‌డిన దేవ‌ర‌క‌ద్ర నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2009లో సీత ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత టీడీపీ తెలంగాణ‌లో క‌నుమ‌రుగ‌వ్వ‌డం, గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి, భ‌ర్త ద‌యాక‌ర్‌రెడ్డి మ‌ర‌ణంతో ఆమె కొన్నాళ్లుగా రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు.

కాంగ్రెస్సా, బీఆర్ఎస్సా?

చ‌నిపోవ‌డానికి కొన్నాళ్ల ముందు అంటే 2022 మొద‌టిలోనే ద‌యాక‌ర్‌రెడ్డి దంప‌తులు తెలుగుదేశానికి రాజీనామా చేశారు. పాల‌మూరు జిల్లాకే చెందిన టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డితో గ‌తంలో టీడీపీలో ప‌ని చేసిన‌ప్ప‌టి నుంచి ద‌యాక‌ర్‌రెడ్డి కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యంతో కాంగ్రెస్‌లో చేర‌తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు సీతాద‌యాక‌ర్‌రెడ్డే రాజకీయ పున‌రాగ‌మ‌నంపై పెద‌వి విప్ప‌డంతో కాంగ్రెస్‌లో చేర‌తారా..? బీఆర్ఎస్ వైపు చూస్తారా..? అనేది ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.

First Published:  19 Aug 2023 5:48 AM GMT
Next Story