Telugu Global
Telangana

జీవితాంతం టికెట్ ఇవ్వకపోతే ఎలా..?

ఏదో ఒక పదవి ఇస్తామని ఇన్నాళ్లు చెబుతూ వచ్చారన్నారు. ప్రస్తుతం తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని పార్టీ నాయకత్వాన్ని బెదిరించేందుకు తాను ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయలేదని, ప్రతి ఏటా ఇలాంటి సమావేశం ఏర్పాటు చేస్తూ ఉంటానని వివరించారు.

జీవితాంతం టికెట్ ఇవ్వకపోతే ఎలా..?
X

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తనతోపాటు తన ముఖ్య అనుచరులంతా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని చెప్పారు. తప్పకుండా ప్రజల దీవెనతో తన అనుచరులు ఏదైతే కోరుకుంటున్నారో అది చేసి చూపిస్తానన్నారు.

గత నాలుగేళ్లలో ఏం జరిగిందో కూడా చూశామని, తన పట్ల టీఆర్ఎస్ ఎలా వ్యవహరించిందో కూడా చూశామన్నారు. బతికున్నంత కాలం టికెట్ ఇవ్వకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఇక తాను ఎదురు చూడలేనని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానన్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అన్నదానిపైన ఆయన సమాధానం ఇవ్వలేదు. అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

ఏదో ఒక పదవి ఇస్తామని ఇన్నాళ్లు చెబుతూ వచ్చారన్నారు. ప్రస్తుతం తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని పార్టీ నాయకత్వాన్ని బెదిరించేందుకు తాను ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయలేదని, ప్రతి ఏటా ఇలాంటి సమావేశం ఏర్పాటు చేస్తూ ఉంటానని వివరించారు.

ఇప్పటికే జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా మీ అనుచరులందరూ వచ్చే ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారు..? ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అని ప్రశ్నించగా ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. ఏ నాయకుడైనా ఐదేళ్లకు మించి ఎన్నికల్లో పాల్గొనకుండా ప్రజలకు దూరంగా ఉండడం సాధ్యం కాదన్నారు. ఆ కోణంలోని తనతో పాటు తన ముఖ్య అనుచరులందరూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్నారు. ప్రస్తుతం తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని కానీ, బతికున్నంత కాలం టికెట్ ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు.

Advertisement

టిఆర్ఎస్ లో నాలుగున్నరేళ్లుగా అనేక అవమానాలు ఎదుర్కొన్నామని, అవన్నీ ఏంటి అన్నది సమయం వచ్చినప్పుడు చెబుతానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన తాను కేసీఆర్, కేటీఆర్ ఆహ్వానం మేరకే అప్పట్లో టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యానని, కానీ గత ఎన్నికల్లో తనకు ఎంపీ టికెట్ ను నిరాకరించారని చెప్పారు. ఆ తర్వాత ఏదో ఒక పదవి వస్తుంది అని తన అనుచరులంతా నమ్మారని, కానీ ఏ పదవి రాలేదు అన్నది వాస్తవం అన్నారు. జిల్లాలోని మూడు జనరల్ స్థానాల్లో ఏదో ఒక చోట పోటీ చేస్తానని, అయితే ఆ నియోజకవర్గం ఏంటి అన్నది ఇప్పటికిప్పుడు తాను చెప్పలేనని, తన బీఫామ్ పై తానే సంతకం పెట్టుకునే పరిస్థితి ప్రస్తుతం లేదు కాబట్టి ఎక్కడి నుంచి పోటీ చేస్తాను అన్నది తర్వాత చెబుతానన్నారు.

Next Story