Telugu Global
Telangana

బీజేపీ శిఖండి రాజకీయాలు.. దేశంలో మోదీ రాజ్యాంగం..

ప్రభుత్వ పథకాలను పొందుతున్న ప్రతి లబ్ధిదారుడినీ ఓటు అడిగే హక్కు తమకు ఉందని చెప్పారు కేటీఆర్. రాజగోపాల్‌ రెడ్డికి కూడా రైతుబంధు వస్తోందని, ఆయనకు మునుగోడులో ఓటుహక్కు ఉంటే టీఆర్‌ఎస్‌ కే ఓటేయాలని కోరారు.

బీజేపీ శిఖండి రాజకీయాలు.. దేశంలో మోదీ రాజ్యాంగం..
X

బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి కేటీఆర్. దేశంలో వ్యవస్థలన్నీ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా చెప్పినట్టు ఆడుతున్నాయని మండిపడ్డారు కేటీఆర్‌. దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం లేదని, మోదీ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. ఈసీ, ఈడీ, సీబీఐ, ఐటీ.. ఇవన్నీ బీజేపీ అనుబంధ సంస్థలుగా, తోక సంస్థలుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు. మునుగోడులో ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవలేక వ్యవస్థలను అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయంచేస్తూ కుట్రలు పన్నుతున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు కేటీఆర్.

Advertisement

నల్లగొండ ప్రజలు చైతన్యవంతులని, నాగార్జునసాగర్‌, హుజూర్‌ నగర్‌ ఫలితాలే ఇక్కడా రిపీట్ అవుతాయన్నారు కేటీఆర్. తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయి వచ్చిన ఉద్యమ బిడ్డ కూసుకుంట్లను ప్రజలు గుండెలకు హత్తుకుంటారని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తుపై తీవ్రంగా ప్రభావం చూపే ఎన్నిక అని చెప్పారు. దేశానికి అత్యధిక ద్రవ్యోల్బణాన్ని అందించిన ప్రధాని మోదీకి, అత్యధిక నిరుద్యోగత రేటు అందించిన మోదీకి, ప్రపంచంలోనే అధిక ధరకు గ్యాస్‌ సిలిండర్ అమ్ముతున్న మోదీకి, ఆకలి సూచీలో 116 దేశాల్లో భారత్‌ను 107వ స్థానానికి పడేసిన మోదీకి తిరుగులేని విధంగా బుద్ధి చెప్పాలని మునుగోడు ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement

ఫోన్ కాల్ పై కేటీఆర్ స్పందన..

ఇటీవల కేటీఆర్ మునుగోడు బీజేపీ నేత జగన్నాథంకు చేసిన ఫోన్ కాల్, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అలా కాల్ చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు కేటీఆర్. తాను ఫోన్ చేసిన నేత కూడా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుడే అని గుర్తు చేశారు. నూలుపై 5శాతం జీఎస్టీ వేసిన మోదీని అంటిపెట్టుకుని ఉండొద్దని, నేతన్నలు తమతోనే ఉండాలని ఆయన్ని అడిగానని అందులో తప్పేముందని అన్నారు కేటీఆర్. ప్రభుత్వ పథకాలను పొందుతున్న ప్రతి లబ్ధిదారుడినీ ఓటు అడిగే హక్కు తమకు ఉందని చెప్పారు. రాజగోపాల్‌ రెడ్డికి కూడా రైతుబంధు వస్తోందని, ఆయనకు మునుగోడులో ఓటుహక్కు ఉంటే టీఆర్‌ఎస్‌ కే ఓటేయాలని కోరారు కేటీఆర్.

Next Story