Telugu Global
Telangana

కాంగ్రెస్‌కు పొన్నాల రాజీనామా.. అదే బాటలో మరో నేత.?

అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా ఇతర నామినేటెడ్ పోస్టు ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ అసంతృప్తి వ్యక్తం చేసిన పొన్నాల పార్టీకి గుడ్‌ బై చెప్పారు.

కాంగ్రెస్‌కు పొన్నాల రాజీనామా.. అదే బాటలో మరో నేత.?
X

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హస్తం పార్టీకి గుడ్‌ బై చెప్పారు. అధిష్టానం టికెట్ ఇవ్వదన్న క్లారిటీ రావడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఈ మేరకు అధిష్టానానికి తన రాజీనామా లేఖను పంపారు పొన్నాల. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని, పార్టీ అంశాలు చర్చించేందుకు కనీసం అవకాశం కూడా ఇవ్వడం లేదన్నారు. వ్యాపార రాజకీయాలతో తెలంగాణలో కాంగ్రెస్ పరువు పోతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపారు.

పొన్నాల లక్ష్మయ్య జనగామ నుంచి టికెట్ ఆశించారు. అయితే 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఓడిపోవడంతో పొన్నాలకు టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం నిరాకరించినట్లు సమాచారం. జనగామ టికెట్‌ కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డికి ఇచ్చేందుకు పార్టీ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ విషయంపైనే పొన్నాలను ఢిల్లీకి పిలిచిన పార్టీ పెద్దలు.. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా ఇతర నామినేటెడ్ పోస్టు ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ అసంతృప్తి వ్యక్తం చేసిన పొన్నాల పార్టీకి గుడ్‌ బై చెప్పారు.

పొన్నాల రాజీనామాతో కాంగ్రెస్‌లోని ఓ వర్గం నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీకి పట్టిన పీడ విరగడైందని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు పొన్నాల రాజీనామాతో జనగామలో కొమ్మూరికి లైన్ క్లియర్‌ అయినట్లేనని ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక మరో సీనియర్ లీడర్ మధుయాష్కి కూడా పార్టీకి గుడ్‌ బై చెప్తారని ప్రచారం జోరందుకుంది. మధుయాష్కి ఎల్బీనగర్‌ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈ సారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని భావిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ వరుసగా రెండు సార్లు ఓడిన నేతలకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. ఈ మేరకు మధుయాష్కికి కూడా హైకమాండ్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కూడా పక్క చూపులు చూస్తున్నారని స‌మాచారం.

First Published:  13 Oct 2023 10:04 AM GMT
Next Story