Telugu Global
Telangana

చిల్ల‌ర చేష్ట‌లు మానుకో రేవంత్‌.. చేత‌గాక అధికారుల‌పై నింద‌లు వేయ‌కు..

ఉద్యమంలో, తెలంగాణ పునర్‌ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్ ఉద్యోగులను చీటికిమాటికి నిందించడం, వారిపై చర్యలు తీసుకోవడం వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమేనన్నారు హరీష్‌ రావు.

చిల్ల‌ర చేష్ట‌లు మానుకో రేవంత్‌.. చేత‌గాక అధికారుల‌పై నింద‌లు వేయ‌కు..
X

విద్యుత్‌ కోతల వెనుక కుట్ర ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్‌ రావు. ప్రభుత్వం వైఫల్యాలలను అంగీకరించకుండా ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ రంగ వైఫల్యాలకు తనను బాధ్యుడిని చేయడం విడ్డూరంగా ఉందంటూ ట్వీట్ చేశారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి తీరు ఆడ రాక పాత గజ్జెలు అన్న సామెతను గుర్తు చేస్తుందన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం 24 గంటలు నిరంతరాయంగా పవర్‌ సప్లై చేసేందుకు..విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్టమైన వ్యవస్థను నిర్మించిందన్నారు హరీష్‌ రావు. రెప్పపాటు కాలం కూడా కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపిందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం 5 నెలల వ్యవధిలోనే ఆ వ్యవస్థను కూల్చిందన్నారు. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపోయే విద్యుత్‌ సరఫరా చేయడంలో రేవంత్ సర్కార్‌ పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు హరీష్‌ రావు. రేవంత్‌ తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు.


ఉద్యమంలో, తెలంగాణ పునర్‌ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్ ఉద్యోగులను చీటికిమాటికి నిందించడం, వారిపై చర్యలు తీసుకోవడం వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమేనన్నారు హరీష్‌ రావు. విద్యుత్ ఉద్యోగులపై నెపం నెట్టడమే తప్ప కరెంటు కోతలను ఎలా సరిదిద్దాలనే చిత్తశుద్ధి సీఎంకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌ చిల్లర మల్లర చేష్టలు మానాలని సూచించారు. తన లాగే అందరూ కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతారని సీఎం భ్రమల్లో ఉన్నారని.. వాటిని వీడి ఇప్పటికైనా పాలన‌పై దృష్టి పెడితే మంచిదన్నారు.

First Published:  15 May 2024 12:04 PM GMT
Next Story