Telugu Global
Telangana

TSPSC ఛైర్మన్‌గా మహేందర్ రెడ్డి.. ఆయన నేపథ్యం ఇదే..!

చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి నేతృత్వంలోని కమిటీ.. ఈ దరఖాస్తులను నిశితంగా పరిశీలించింది. తర్వాత ఛైర్మన్ పదవికి సంబంధించిన పేర్లను షార్ట్ లిస్ట్ చేసి గవర్నర్‌కు పంపగా.. మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళి సై ఓకే చెప్పారు.

TSPSC ఛైర్మన్‌గా మహేందర్ రెడ్డి.. ఆయన నేపథ్యం ఇదే..!
X

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డి నియమితుల‌య్యారు. ఈ మేరకు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు గవర్నర్ తమిళి సై గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు. సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్‌ అనిత రాజేందర్‌, పాల్వాయి రజనీకుమారి, అమీర్ ఉల్లాఖాన్, యాదయ్య, వై.రామ్మోహన్‌ రావు నియమితులయ్యారు. గతేడాది జరిగిన పేపర్ లీకేజీ ఘటనతో పాటు ప్రభుత్వం మారడంతో ఛైర్మన్ పదవికి జనార్ద‌న్ రెడ్డి, ఇతర సభ్యులు TSPSCకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ వారి రాజీనామాలకు ఆమోదముద్ర వేయడంతో.. కొత్త ఛైర్మన్ కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఛైర్మన్, సభ్యుల పదవి కోసం దాదాపు 371 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 50 దరఖాస్తులు కేవలం ఛైర్మన్ పదవి కోసం వచ్చాయి.

చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి నేతృత్వంలోని కమిటీ.. ఈ దరఖాస్తులను నిశితంగా పరిశీలించింది. తర్వాత ఛైర్మన్ పదవికి సంబంధించిన పేర్లను షార్ట్ లిస్ట్ చేసి గవర్నర్‌కు పంపగా.. మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళి సై ఓకే చెప్పారు. ఛైర్మన్, సభ్యుల నియామకం పూర్తి కావడంతో త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగం పుంజుకుంటుందని నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మహేందర్‌ రెడ్డి స్వగ్రామం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం. నల్గొండ జిల్లా సర్వేల్‌ గురుకుల పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆయన.. వరంగల్‌ NITలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తర్వాత ఢిల్లీ NITలో ఎంటెక్ చదువుతుండగా.. ఐపీఎస్‌కు సెలక్ట్ అయ్యారు. మహేందర్ రెడ్డి 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ సూపరిండెంట్‌గా తొలి పోస్టింగ్ అందుకున్నారు. తర్వాత ఉమ్మడి ఏపీలోని చాలా జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో హైదరాబాద్ సీపీగా నియమితులయ్యారు. తర్వాత డీజీపీ అనురాగ్ శర్మ రిటైర్మెంట్ కావడంతో.. 2017 నవంబర్‌లో ఇంఛార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. 2018 ఏప్రిల్ 10న పూర్తి స్థాయిలో డీజీపీగా బాధ్యతలు పొందారు. 2022 డిసెంబర్‌లో డీజీపీగా రిటైర్ అయ్యారు.

First Published:  25 Jan 2024 11:36 AM GMT
Next Story