Telugu Global
Telangana

రాజగోపాల్‌ రెడ్డికి అనుచరులు షాకిచ్చారా? మీటింగ్‌లో ఏం జరిగింది?

తాను బీజేపీలోకి వెళ్తున్నానని.. తనతో ఎవరెవరు వస్తారని రాజగోపాల్ ప్రశ్నించారు. అందరూ కలసి వస్తే భవిష్యత్ బాగుంటుందని అన్నారు. దీనికి కాంగ్రెస్ నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.

Komatireddy Raj Gopal Reddy
X

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి అనుచరులు షాక్ ఇచ్చారా? బీజేపీలోకి వెళ్తే మీ వెంట మేము రాలేమని చెప్పేశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతున్నది. పార్టీ బుజ్జగించినా రాజగోపాల్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. వారం పది రోజుల్లో రాజగోపాల్ తన రాజకీయ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. అయితే అంతకుముందు అనుచరులు, స్థానిక నాయకులతో మాట్లాడి వారి అభిప్రాయం తెలుసుకుందామని అనుకున్నారు. అయితే ఆ భేటీలో రాజగోపాల్‌కు ఊహించని వ్యతిరేకత కనిపించింది.

మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో నాంపల్లి, మర్రిగూడ, చండూరు మండలాలకు చెందిన కార్యకర్తలు, మండల పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. తాను బీజేపీలోకి వెళ్తున్నానని.. తనతో ఎవరెవరు వస్తారని రాజగోపాల్ ప్రశ్నించారు. అందరూ కలసి వస్తే భవిష్యత్ బాగుంటుందని అన్నారు. దీనికి కాంగ్రెస్ నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.

తాము మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నామని.. పాల్వాయి గోవర్ద‌న్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్‌ను నమ్ముకొని ఉన్న కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్తేనే గత ఎన్నికల్లో మీకు మద్దతుగా పని చేశాము. ఇప్పుడు మీ స్వప్రయోజనాల కోసం వెళ్లిపోతుంటే.. మేమెందుకు మీ వెంట రావాలని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. నాతో పాటు ఇద్దరు కాంగ్రెస్ కీలక నేతలు కూడా బీజేపీలోకి వస్తున్నారని.. అక్కడ ఉంటే భవిష్యత్ ఉంటుందని రాజగోపాల్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారట. కానీ మెజార్టీ నాయకులు మాత్రం కాంగ్రెస్ లోనే ఉండండి.. మేం గెలిపించుకుంటామని చెప్పినట్లు సమాచారం.

మూడు మండలాల (ఇందులో కొత్తగా ఏర్పడిన గట్టుప్పల నాయకులు కూడా ఉన్నారు) నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో భిన్నాభిప్రాయాలు వచ్చే సరికి రాజగోపాల్ కాస్త అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ, గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ తనకు, అన్న వెంకటరెడ్డికి చేసిన అన్యాయం గురించి ఏకరవు పెట్టినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ కోసం న్యూస్ ఛానల్ పెట్టినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారట. సీఎల్పీ, టీపీసీసీ చీఫ్ పదవులను కోరినా.. వేరే వాళ్లకు కట్టబెట్టారని.. ఇంకెన్నాళ్లు పార్టీలో ఉంటూ నష్టపోవాలని రాజగోపాల్ వ్యాఖ్యానించారు. బుధవారం చౌటుప్పల్, మునుగోడు, నారాయణపూర్ మండల నాయకులు, కార్యకర్తలతో రాజగోపాల్ సమావేశం కానున్నారు.

కాగా, కాంగ్రెస్ పార్టీనుంచి రాజగోపాల్ మూకుమ్మడిగా మండలాధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలను బీజేపీలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. తన బలాన్ని బీజేపీ అధిష్టానానికి తెలియజేయాలని రాజగోపాల్ స్కెచ్ వేశారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే రాజగోపాల్ వెంట ఎంత మంది వెళ్తారనేది అనుమానంగానే ఉంది. చాలా మంది కాంగ్రెస్ తోనే ఉండాలని పట్టుబడుతున్నా.. రాజగోపాల్ మాత్రం బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు. మరి రాజగోపాల్ ఒంటరిగా వెళ్తారా.? ముఖ్య నాయకులను వెంట తీసుకెళ్తారా అనేది వారం పది రోజుల్లో స్పష్టం కానుంది.

First Published:  27 July 2022 6:13 AM GMT
Next Story