Telugu Global
Telangana

భయం గుప్పెట్లో భద్రాచలం.. చరిత్రలో రెండోసారి వంతెన మూసివేత..

భారీ వరద నేపథ్యంలో వంతెనపై రాకపోకలు నిలిపివేయడంతో పాటు భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు కలెక్టర్‌ అనుదీప్‌ ప్రకటించారు.

భయం గుప్పెట్లో భద్రాచలం.. చరిత్రలో రెండోసారి వంతెన మూసివేత..
X

భద్రాచలం వద్ద గోదావరిపై వంతెన కట్టిన తర్వాత గతంలో ఒకే ఒక్కసారి రాకపోకలు నిలిపివేశారు. 1986లో భద్రాచలం వద్ద నీటిమట్టం 75.6 అడుగులకు చేరడంతో రాకపోకలు ఆగిపోయాయి. ఆ చరిత్ర మళ్లీ ఇప్పుడు గోదావరి తిరగరాసింది. మహోగ్రరూపం దాల్చింది. దీంతో 2022లో మరోసారి వంతెన మూతపడింది. భద్రాచలం చరిత్రలో వంతెన మూతపడటం ఇది రెండోసారి. నిన్న సాయంత్రం 5 గంటలనుంచి ఆంక్షలు అమలులోకి వచ్చాయి. 48 గంటల పాటు కొనసాగుతాయి. దీంతో ఛత్తీస్‌ గఢ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వరద నేపథ్యంలో వంతెనపై రాకపోకలు నిలిపివేయడంతో పాటు భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు కలెక్టర్‌ అనుదీప్‌ ప్రకటించారు.

ఈరోజు రాత్రికి ప్రళ‌య రూపం..

ఇప్పటికే గోదావరి ఉగ్రరూపాన్ని చూశాం, ఈరోజు రాత్రికి భద్రాచలం వద్ద వరద ప్రవాహం మరింత పెరుగుతుందని అంచనా. గతంలో 1986లో అత్యధికంగా 75.6 అడుగుల నీటిమట్టం నమోదు కాగా, 1990లో 70.80, 2006లో 66.90 అడుగులు నమోదైంది. ప్రస్తుతం అన్ని రికార్డుల బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు రాత్రికి గోదావరి ప్రవాహం 75 అడుగులు టచ్ అయ్యే అవకాశముంది. దీనికి తగ్గట్టుగానే గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.

భద్రాచలానికి పైభాగాన ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ గోదావరి వరద కొత్త రికార్డులు సృష్టించింది. ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి. వేలాదిమంది ఇళ్లను వదిలిపెట్టి కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. కాళేశ్వరం రెండు పెద్ద పంపు హౌస్‌ లు నీటమునిగాయి. కడెం ప్రాజెక్టు స్పిల్‌వే పై నుంచి నీరు వెల్లువెత్తింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో లక్షలాది ఎకరాల పంటల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి.

తగ్గేది లేదు.. పెరగడమే..

కేంద్ర జలసంఘం బులెటిన్‌ ప్రకారం ఏటూరు నాగారం, దుమ్ముగూడెం, భద్రాచలం, కూనవరం, చింతూరు, ధవళేశ్వరం వద్ద శుక్రవారం భారీ ప్రవాహం కొనసాగుతుంది. మేడిగడ్డ వద్ద గత రాత్రి విడుదల చేసిన 28.58 లక్షల క్యూసెక్కుల వరద భద్రాచలం వద్దకు చేరడానికి 15 నుంచి 20 గంటల సమయం పడుతుందని ఇంజినీర్ల అంచనా. శ్రీరామసాగర్‌, కడెం నుంచి విడుదల చేసే నీటితోపాటు స్థానిక పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో వరద పోటెత్తుతోంది. భారీ వరదతో కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. 100 మీటర్ల పూర్తి స్థాయి నీటిమట్టంతో బ్యారేజి నిర్మించగా గురువారం సాయంత్రానికే అక్కడ 108.8 మీటర్లుగా నీటిమట్టం నమోదైంది.

First Published:  15 July 2022 2:18 AM GMT
Next Story