Telugu Global
Telangana

నాడు ఎన్టీఆర్, నేడు కేసీఆర్.. ఖమ్మంలో ఫ్లెక్సీ కలకలం..

మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యానికై నాడు ఎన్టీఆర్, నేడు కేసీఆర్.. అంటూ ఫ్లెక్సీలో నినాదాలు రాశారు. తెలుగోడి ఆత్మగౌరవం నిలుపు దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ టీఆర్ఎస్ జాతీయ రాజకీయాలకు శుభ సూచకంగా ఈ ఫ్లెక్సీ వేశారు.

నాడు ఎన్టీఆర్, నేడు కేసీఆర్.. ఖమ్మంలో ఫ్లెక్సీ కలకలం..
X

రాష్ట్ర విభజన సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పటికీ ఖమ్మంలో టీడీపీకి అభిమానులున్నారు. కానీ రాజకీయ సమీకరణాలు, అవసరాల దృష్ట్యా ఎవరూ టీడీపీ తరపున పోటీ చేయడంలేదు. పోటీ చేసి గెలిచినా అధికార పార్టీలోకే వెళ్తారనే ప్రచారం ఉంది. ఈ దశలో తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం ఓట్లకోసం ఇటీవల బీజేపీ వ్యూహ రచన చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ని దువ్వడంతోపాటు, చంద్రబాబుతో కూడా సఖ్యతగా ఉన్నట్టు కలరింగ్ ఇస్తోంది. అయితే తెలంగాణలో 2024నాటికి ఆ సామాజిక వర్గం ఎటువైపు ఉంటుందనేది ఆసక్తిగా మారింది.

ఖమ్మంలో పోస్టర్లు..

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ఖానాపురం గ్రామంలో జరిగిన ఒక సమావేశం సందర్భంగా కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఓ ఫ్లెక్సీ వేశారు. ఇందులో ఎన్టీఆర్ ఓవైపు, కేసీఆర్ మరోవైపు ఉన్నారు. మధ్యలో గాంధీజీ ఫొటో వేశారు. మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యానికై నాడు ఎన్టీఆర్, నేడు కేసీఆర్.. అంటూ ఫ్లెక్సీలో నినాదాలు రాశారు. తెలుగోడి ఆత్మగౌరవం నిలుపు దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ టీఆర్ఎస్ జాతీయ రాజకీయాలకు శుభ సూచకంగా ఈ ఫ్లెక్సీ వేశారు. ఫ్లెక్సీపై టీఆర్ఎస్ గ్రామ శాఖ అని ఉన్నా కూడా.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ పై కేసీఆర్ కి ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరినా వారికి సముచిత స్థానం ఇచ్చి గౌరవించారు కేసీఆర్. దీంతో సహజంగా టీడీపీ కార్యవర్గం కూడా కేసీఆర్ వైపు ఆకర్షితులయ్యారు. ప్రత్యేకించి ఖమ్మంలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు కేసీఆర్ పై తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలని, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని మరోసారి ఢిల్లీకి తెలియజేయాలని ఫ్లెక్సీ వేసి తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఖానాపురంలో జరిగిన కార్యక్రమానికి వచ్చారు, ఫ్లెక్సీని చూశారు. కానీ ఎవరూ ఎలాంటి కామెంట్ చేయకపోవడం విశేషం.

First Published:  30 Sep 2022 4:26 AM GMT
Next Story