Telugu Global
Telangana

మృగశిర కార్తె ఆరంభం.. చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం

నాంపల్లి గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ జరుగుతోంది. 32 కౌంటర్ల వద్దకు ఉబ్బసం వ్యాధిగ్రస్తులు, వారి కుటుంబ సభ్యులు క్యూ లైన్లలో వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు.

మృగశిర కార్తె ఆరంభం.. చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
X

మృగశిర కార్తె ఆరంభం.. చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం

మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ మొదలైంది. ఈరోజు ఉదయం రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ చేప ప్రసాదం పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. రెండు రోజుల పాటు నాంపల్లి గ్రౌండ్స్ లో బత్తిని కుటుంబ సభ్యులు ఈ ప్రసాదం పంపిణీ చేస్తారు. ఆ తర్వాత వారం రోజుల పాటు ఇంటి వద్దకు వచ్చినవారికి చేప ప్రసాదం వితరణ చేస్తారు. గర్భిణులకు మాత్రం ఈ ప్రసాదాన్ని ఇవ్వరు. బత్తిని కుటుంబ సభ్యులు 200మంది వారికితోడు వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.



ప్రస్తుతం నాంపల్లి గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ జరుగుతోంది. 32 కౌంటర్ల వద్దకు క్యూ లైన్లలో వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. ఈ చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు హైదరాబాద్ నగరంతో పాటు వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ కు తరలివచ్చారు.

చేప ప్రసాదాన్ని మాత్రమే బత్తిని కుటుంబం ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఆ ప్రసాదాన్ని స్వీకరించేందుకు భక్తులు తమకు తామే చేప పిల్లలను తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆరు లక్షల చేప పిల్లలను తెలంగాణ మత్స్యశాఖ సిద్ధం చేసింది. ఉబ్బసం బాధితులకు ఈ చేప పిల్లలను అందిస్తున్నారు. ఉబ్బసం వ్యాధిగ్రస్తులు, వారిని తీసుకు వచ్చిన కుటుంబ సభ్యులతో నాంపల్లి గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలు కిక్కిరిశాయి. ఈ ప్రాంతానికి చేరుకోడానికి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.

First Published:  9 Jun 2023 4:39 AM GMT
Next Story