Telugu Global
Andhra Pradesh

చలో వైజాగ్.. తొలి అడుగు పడింది

విశాఖలో మొత్తం 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్యాలయాలతోపాటు, విడిది అవసరాలకు కూడా భవనాలను కేటాయించింది.

చలో వైజాగ్.. తొలి అడుగు పడింది
X

రాజధాని వైజాగ్ కి తరలిస్తున్నామంటూ వైసీపీ హడావిడి చేసిందని, ఇప్పటి వరకు డెడ్ లైన్లు పెట్టి సరిపెట్టిందని కామెంట్ చేసినవారందరికీ ఇదే సమాధానం. పాలాన రాజధాని విశాఖ తరలింపులో తొలి అడుగు పడింది. మొత్తం 2 లక్షల 27వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలను ఇటీవల విశాఖ పర్యటనకు వెళ్లిన త్రిసభ్య కమిటీ గుర్తించింది. అందులో కొన్ని కార్యాలయాలను ఆయా శాఖలకు కేటాయిస్తూ సీఎస్‌ జవహర్‌ రెడ్డి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

విశాఖ రుషికొండ మిలీనియం టవర్స్‌ లో మంత్రులు, అధికారుల క్యాంప్‌ కార్యాలయాలు నిర్వహించేందుకు ఇటీవల త్రిసభ్య కమిటీ సిఫారసు చేసింది. ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన సమయంలో భవనాల వినియోగంపై కమిటీ నివేదిక మేరకు సీఎస్ జవహర్ రెడ్డి తాజా ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం, మంత్రులు ఉత్తరాంధ్రలో సమీక్షలకు వెళ్లినప్పుడు ఉపయోగించేందుకు మిలీనియం టవర్స్‌ లో ఏ, బీ టవర్స్‌ ను కేటాయించారు.

విశాఖలో మొత్తం 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్యాలయాలతోపాటు, విడిది అవసరాలకు కూడా భవనాలను కేటాయించింది. ఆంధ్రా యూనివర్శిటీ, రుషికొండ, చినగదిలి సమీపంలో భవనాలు కేటాయించారు. ఎండాడ, హనుమంత్వాక ప్రాంతాల్లో కూడా కార్యాలయాలు కేటాయించారు. సాధారణ పరిపాలన, ఆర్థిక, గ్రామవార్డు సచివాలయ, ఇంధన శాఖలు మినహా మినహా వాటికి మాత్రమే భవనాలు కేటాయించారు.

సీఎం క్యాంపు కార్యాలయం ఎక్కడ..?

ప్రస్తుతానికి సీఎం క్యాంపు కార్యాలయం ఎక్కడనేది సస్పెన్స్ గా మారింది. అమరావతి వ్యవహారం కోర్టులో ఉన్నందున రాజధాని మార్పు అనే పేరు వాడకుండా ప్రభుత్వం ఈ తరలింపు ప్రక్రియ చేపట్టింది. కేవలం ఉత్తరాంధ్ర పర్యటనల్లో ఉపయోగించుకోడానికి వీలుగా అంటూ ఆయా కార్యాలయాల కేటాయింపు జరిగింది. అందుకే సీఎం క్యాంపు కార్యాలయం అనేది ప్రస్తుతానికి ప్రస్తావించలేదు.

First Published:  23 Nov 2023 12:05 PM GMT
Next Story