Telugu Global
Telangana

పార్లమెంట్ లో కేంద్రంపై సమరశంఖం... ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న‌ కేసీఆర్

కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. దేశాన్ని ఆర్థికపతనం వైపు తీసుకెళ్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆరెస్ అధినేత కేసీఆర్ పోరు ముమ్మరం చేస్తున్నారు.

పార్లమెంట్ లో కేంద్రంపై సమరశంఖం... ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న‌ కేసీఆర్
X

కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. దేశాన్ని ఆర్థికపతనం వైపు తీసుకెళ్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆరెస్ అధినేత కేసీఆర్ పోరు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ విధానాలను చీల్చి చెండాడుతున్న కేసీఆర్ పార్లమెంటులో కూడా పోరాటానికి నడుం భిగించారు. అందుకోసం టీఆరెస్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ నెల 18 నుంచి ప్రారంభ కానున్న పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో, ఉభయ సభల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన విధివిధానాల పై దిశానిర్దేశం చేసేందుకు, టీఆర్ఎస్ పార్లమెంట్ (రాజ్యసభ, లోక్ సభ) సభ్యులతో రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రగతిభవన్ లో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ మేరకు ట్విట్టర్, ఫేస్ బుక్ లలో టీఆర్ ఎస్ పార్టీ వివరాలను వెల్లడించింది.

కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల పై పార్లమెంటులో తీవ్ర స్థాయిలో పోరాడాలని ఎంపీలకు సూచించనున్నారు కేసీఆర్. ఈ సందర్భంగా లోక్ సభ, రాజ్యసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు అవలంబించవలసిన పలు కీలక అంశాలపై సీఎం కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మోడీ సర్కార్ పాలనలో పతనావస్థకు చేరుకుంటున్న రూపాయి విలువ. దేశానికి శాపంలా మారిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆర్ధిక విధానాలు, ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మడం, తెలంగాణ పట్ల వివక్ష, ఫెడరల్ వ్యవస్థను నాశనం చేస్తూ రాష్ట్రాల హక్కులను కాలరాయడం తదితర అంశాలపై ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీయాలని కేసీఆర్ ఎంపీలకు సూచించనున్నారు.

ఒక వైపు అటు వరదలనుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మంత్రులు, అధికార యంత్రాంగానికి ఆదేశాలిస్తూనే ఇటు బిజెపి అప్రజాస్వామిక విధానాల విపత్తునుంచి దేశాన్ని కాపాడేందుకు పార్లమెంట్ వేదికలపై పోరాటానికి సమాయత్తం అవుతున్నారు కేసీఆర్.

కేంద్రం మెడలువంచి దేశంలో ప్రజాస్వామిక విలువలను కాపాడే దిశగా అన్ని విపక్ష పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేందుకు మంతనాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలువురు విపక్ష నేతలతో మాట్లాడిన కేసీఆర్ మరింత పగడ్బందీగా పోరుకు ప్రణాళికలు రచిస్తున్నారు.ఈ క్ర‌మంలో దేశంలోని ప‌లు రాష్ట్రాల విప‌క్ష నేత‌ల‌తో కేసీఆర్ ఈ ఉద‌యం ఫోన్‌లో మాట్లాడారు. శుక్రవారం ఉద‌యం పలువురు ముఖ్యమంత్రులతో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. జాతీయ నేతలతోనూ సీఎం చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్, త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్, బీహార్ ఆర్జేడీ నేత తేజ‌స్వీయాద‌వ్, యూపీ ప్ర‌తిప‌క్ష నేత అఖిలేష్ యాద‌వ్, ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌తో పాటు ప‌లువురు జాతీయ నాయ‌కుల‌తో కేసీఆర్ స్వ‌యంగా ఫోన్‌లో మాట్లాడారు. కేంద్రంపై పోరాటానికి క‌లిసి రావాల‌ని కేసీఆర్ వారిని కోరారు. కలిసివచ్చే అన్నిరాష్ట్రాల విపక్ష పార్టీలను సమన్వయం చేసుకుంటూ ఈ పోరాటం ముందుకు తీసుకెళ్ళాలని కేసీఆర్ ఆలోచనగా ఉంది.

First Published:  15 July 2022 8:14 AM GMT
Next Story