Telugu Global
Telangana

హృదయ విదారకం.. కళ్లెదుటే భర్త, కుమార్తె దుర్మరణం

నిజామాబాద్‌లో అందరూ ఒకే బోగీలోకి మారేందుకు రైలు దిగారు. భార్య ఉన్న బోగీలోకి పెద్ద కుమార్తె జస్మితను ఎక్కించారు. చిన్న కుమార్తె జననిని అదే బోగీలోకి ఎక్కిస్తుండగా రైలు ముందుకు కదిలింది.

హృదయ విదారకం.. కళ్లెదుటే భర్త, కుమార్తె దుర్మరణం
X

విజయదశమి వేడుకల వేళ.. దుర్గమ్మ తల్లి జన్మ నక్షత్రమైన మూలానక్షత్రం రోజున బాసర సరస్వతీ దేవిని దర్శించుకోవాలని బయలుదేరిన కుటుంబం ప్రమాదంలో చిక్కుకొంది. తండ్రి, కుమార్తె ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. కళ్లెదుటే భర్త, బిడ్డ మృతిచెందడం చూసి ఆ ఇల్లాలు గుండెలవిసేలా రోదించింది. నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం గని ఆత్కూరు గ్రామానికి చెందిన రామచంద్రరావు (45) హైదరాబాదులో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఖమ్మం పట్టణానికి చెందిన సునీతతో 17 ఏళ్ల కిందట అతనికి వివాహం కాగా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు మియాపూర్‌లో స్థిరపడ్డారు. పెద్ద కుమార్తె జస్మిత ఇంటర్‌ చదువుతుండగా, చిన్న కుమార్తె జనని (15) పదో తరగతి చదువుతోంది. శుక్రవారం బాసరలో సరస్వతీ దేవికి పూజ చేసుకోవడం కోసం దంపతులిద్దరూ తమ కుమార్తెలతో కలసి గురువారం రాత్రి హైదరాబాద్‌ నుంచి రైలులో బయలుదేరారు. రామచంద్రరావు, సునీత ఒక బోగీలో, ఇద్దరు కుమార్తెలు మరో బోగీలో ఎక్కారు.

నిజామాబాద్‌లో అందరూ ఒకే బోగీలోకి మారేందుకు రైలు దిగారు. భార్య ఉన్న బోగీలోకి పెద్ద కుమార్తె జస్మితను ఎక్కించారు. చిన్న కుమార్తె జననిని అదే బోగీలోకి ఎక్కిస్తుండగా రైలు ముందుకు కదిలింది. జనని పట్టుతప్పి రైలు కింద పడిపోయింది. ఆమెను పైకి లాగేందుకు ప్రయత్నించిన తండ్రి రామచంద్రరావు సైతం రైలుకి, పట్టాలకు మధ్య ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో జనని అక్కడికక్కడే దుర్మరణం చెందగా, తీవ్ర గాయాలపాలైన రామచంద్రరావును స్థానికులు ప్రైవేటు ఆస్ప‌త్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. భర్త, చిన్న కుమార్తె కళ్లముందే మృతిచెందడంతో సునీత కుప్పకూలిపోయింది. బిడ్డ, భర్త మృతదేహాలపై పడి ఆమె విలపించిన తీరు స్థానికులను కన్నీళ్లు పెట్టించింది.

First Published:  21 Oct 2023 2:29 AM GMT
Next Story