Telugu Global
Telangana

రేవంత్ పాలనలో బాగా ఇబ్బంది పడుతోంది వీళ్లే..

కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో చేతికొచ్చిన ధాన్యాన్ని రైతులు ఎంతోకొంతకు అమ్ముకుంటున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు, రైస్‌మిల్లర్లు రైతుల్ని దోపిడీ చేస్తున్నారు.

రేవంత్ పాలనలో బాగా ఇబ్బంది పడుతోంది వీళ్లే..
X

తెలంగాణలో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మొన్నటిదాకా నీళ్లు లేక పంటలు ఎండితే.. అరకొరగా వచ్చిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అరిగోస పడుతున్నారు. ఇది చాలదన్నట్లు అకాల వ‌ర్షాలు రైతుల్ని మరింత భయపెడుతున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు భారీగా ప్రారంభించామని ప్రభుత్వం పేపర్‌ లెక్కలు చూపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.

కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులు

ఈనెల 8నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు ప్ర‌భుత్వం ప్రకటించింది. కానీ, నేటికీ 50శాతం కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ప్రారంభమైన చోట తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కొన్నిచోట్ల ధాన్యం ఎండబెట్టినప్పటికీ.. వెంటనే కొనుగోలు చేయకపోవడంతో ఇటీవల కురిసిన జల్లులతో మళ్లీ తడిసింది. దీంతో రైతులు మళ్లీ ఆరబెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది.

నష్టానికే అమ్ముకుంటున్న రైతులు..

కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో చేతికొచ్చిన ధాన్యాన్ని రైతులు ఎంతోకొంతకు అమ్ముకుంటున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు, రైస్‌మిల్లర్లు రైతుల్ని దోపిడీ చేస్తున్నారు. క్వింటాల్‌కు రూ.1800 చొప్పునే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఫైన్‌ రకాలకు క్వింటాలుకు రూ.2,203, సాధారణ రకాలకు రూ.2,183 మద్దతు ధర ఉంది. ఈ లెక్కన క్వింటాల్‌పై రూ.400 వరకు రైతులు నష్టపోతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌ ఇస్తామని చేతులెత్తింది. కొనుగోలు కేంద్రాల్లో రైతుల పరిస్థితి ఇలా ఉంటే.. మంత్రులెవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. అధికారులు కూడా ఎన్నికల విధుల్లో నిమగ్నం అవడంతో రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి.

First Published:  19 April 2024 5:21 AM GMT
Next Story