Telugu Global
Telangana

'ఆ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఫేక్.. వాట్సప్ వార్తలు నమ్మొద్దు'

వాట్సప్‌లో చక్కర్లు కొడుతున్న నోటిఫికేషన్ పూర్తిగా ఫేక్ అని, ఈఎస్ఐ ఎలాంటి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని డిప్యుటీ డైరెక్టర్ రాజీవ్ నందన్ రే ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఫేక్.. వాట్సప్ వార్తలు నమ్మొద్దు
X

చదువుకున్న ప్రతీ ఒక్కరి లక్ష్యం ఉద్యోగం సాధించడమే. అందులో గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్లు పడ్డాయంటే అందరూ ఆసక్తిగా అప్ల‌య్ చేస్తారు. అవసరం అయితే కోచింగ్‌కు వెళ్లి మరింత మంచిగా సన్నద్ధం అవుతారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా ఈఎస్ఐసీ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో నడిచే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో రెగ్యులర్ విధానంలో పలు ఉద్యోగాలు రిక్రూట్ చేస్తున్నట్లు ఓ నోటిఫికేషన్ చక్కర్లు కొట్టింది.

స్టాఫ్ నర్స్, ఈసీజీ టెక్నీషియన్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఫిజియో థెరపిస్ట్, ఫార్మాసిస్ట్, ఆయుర్వేద ఫార్మాసిస్ట్, ఆప్టోమెట్రిస్ట్, డెంటల్ హైజీనిస్ట్, జూనియర్ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వంటి ఉద్యోగాల్లో మొత్తం 205 ఖాళీలను నింపుతున్నామని.. ఇవన్నీ తెలంగాణ పరిధిలోని ఈఎస్ఐ ఆసుపత్రులకు సంబంధించినవేనని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీంతో వేలాది మంది ఉద్యోగార్థులు ఉద్యోగాలు అప్ల‌య్‌ చేయడానికి ఈఎస్ఐ వెబ్‌సైట్‌ను ప్రతీ రోజు సందర్శిస్తున్నారు. సెప్టెంబర్ 9న దరఖాస్తుకు చివరి తేదీ కావడం, అప్ల‌య్ చేయడానికి ఆన్‌లైన్ లింక్ కనపడకపోవడంతో ఆందోళన చెందిన అభ్యర్థులు కాల్ సెంటర్‌ను సంప్రదించారు. ప్రతీ రోజు వందలాది కాల్స్ వస్తుండటంతో ఈఎస్ఐ డిప్యుటీ డైరెక్టర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

వాట్సప్‌లో చక్కర్లు కొడుతున్న నోటిఫికేషన్ పూర్తిగా ఫేక్ అని, ఈఎస్ఐ ఎలాంటి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని డిప్యుటీ డైరెక్టర్ రాజీవ్ నందన్ రే ఓ ప్రకటన విడుదల చేశారు. దీన్ని ఈఎస్ఐ వెబ్‌సైట్‌లో కూడా ఉంచారు. 'ఫేక్ నోటిఫికేషన్ ఒకటి వాట్సప్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. మేం ఎలాంటి ఉద్యోగ ప్రకటన ఇవ్వలేదు. కాబట్టి ప్రజలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ ప్రకటనల కోసం కేవలం ఈఎస్ఐ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే చూడాలి. ఇలాంటి వాటిని ఫాలో కావొద్దు' అని ఆయన ప్రకటనలో కోరారు.

First Published:  5 Sep 2022 2:41 AM GMT
Next Story