Telugu Global
Telangana

ఓటుకు దొంగనోటు ఇచ్చేస్తారా ఏంటి..? హైదరాబాద్ లో నకిలీ నోట్ల డంప్

కొత్త నోట్లు వచ్చాక నకిలీ నోట్ల బెడద తగ్గుతుంది అనుకుంటే ఇప్పుడు మరింతగా పెరగడం విశేషం. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి తరలించిన దొంగ నోట్ల విషయంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఓటుకు దొంగనోటు ఇచ్చేస్తారా ఏంటి..? హైదరాబాద్ లో నకిలీ నోట్ల డంప్
X

ఎన్నికల వేళ.. వాహనాల తనిఖీల్లో నోట్ల కట్టలు బయటపడటం సహజమే. ఓటుకు నోటు పంచే క్రమంలో అభ్యర్థులు నోట్ల కట్టలను ఒకచోట నుంచి ఇంకో చోటకు తరలిస్తూ తనిఖీల్లో దొరికిపోతుంటారు. అదే సమయంలో హవాలా సొమ్ము కూడా చేతులు మారడం కష్టం. అయితే తాజాగా దొంగనోట్లు పట్టుబడటం మాత్రం సంచలనంగా మారింది. సార్వత్రిక ఎన్నికల వేళ హైదరాబాద్‌లో భారీగా నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వాహనాలను తనిఖీ చేస్తుండగా.. రూ.25 లక్షల నకిలీ నోట్లను మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చినట్లు గుర్తించారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

ఓటుకు నోటు..

ఎన్నికల వేళ ఓటుకు నోటు ఇవ్వడం సహజమే. అయితే ఈసారి నకిలీనోట్లు ఇచ్చే ప్రమాదం కూడా ఉందని ఈ ఉదాహరణ రుజువు చేస్తోంది. ఎన్నికల వేళ ఓటరు చేతిలో హడావిడిగా నోట్లు పెట్టేసి తమకే ఓటు వేయాలని చెప్పేస్తుంటారు పార్టీ నేతలు. అలా ఇచ్చే నోట్లు అసలా, లేక నకిలీనా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్ లో పట్టుబడిన నోట్ల కట్టలు ఎన్నికల కోసం తెచ్చారా..? లేక నకిలీ నోట్ల ముఠా దందాలో ఇది భాగమా అనేది తేలాల్సి ఉంది.

ప్రస్తుతం 2వేల రూపాయల నోట్లు కూడా రద్దవడంతో.. రూ.500 నోట్లు ఎక్కువగా చెలామణిలో ఉన్నాయి. కొందరు కేటుగాళ్లు అనుమానం రాకుండా 100, 200 రూపాయల నోట్లకు కూడా నకిలీలను తెచ్చేస్తున్నారు. కొత్త నోట్లు వచ్చాక నకిలీ నోట్ల బెడద తగ్గుతుంది అనుకుంటే ఇప్పుడు మరింతగా పెరగడం విశేషం. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి తరలించిన దొంగ నోట్ల విషయంలో కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  4 April 2024 9:52 AM GMT
Next Story