Telugu Global
Telangana

దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు.. - ఇద్దరు నిందితుల అరెస్ట్‌

తొలిసారి చేసిన ప్రయత్నం విజయవంతం కావడంతో ఇంకా ఉత్సాహంగా వారు ఈ ప్రక్రియకు తెర తీశారు. రెండోసారి రూ.4.05 లక్షల విలువైన దొంగ నోట్లను ముద్రించి వాటిని కూడా చెలామణి చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు.. - ఇద్దరు నిందితుల అరెస్ట్‌
X

దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టయింది. ఆన్‌లైన్‌లో చూసి దొంగ నోట్లను ముద్రిస్తున్న ఇద్దరు నిందితులను అల్లాపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి అల్లాపూర్‌ సీఐ శ్రీపతి ఆంజనేయులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్‌ జిల్లాకు చెందిన వనం లక్ష్మీనారాయణ (37) కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చి బోడుప్పల్‌లోని మారుతీనగర్‌ లో ఉంటున్నాడు. ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న అతను.. గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతనికి వరంగల్‌ జిల్లాకు చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి ఎరుకల ప్రణయ్‌ కుమార్‌ (26) మిత్రుడు. ఇటీవల లక్ష్మీనారాయణ ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడంతో దొంగ నోట్ల తయారీకి నిర్ణయించుకున్నాడు. ఆన్‌లైన్‌లో శోధించి ఓటీటీలో ఉన్న ఓ బాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ గురించి తెలుసుకున్నాడు. అది అతన్ని విపరీతంగా ఆకర్షించింది. అందులో ఉన్న అంశాలను ఆకళింపు చేసుకోవడం కోసం ఏకంగా ఆ సిరీస్‌ను 150 సార్లు చూశాడు.

ఫలించిన మొదటి ప్రయత్నం..

ఆ తర్వాత దొంగనోట్లను ముద్రించేందుకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసి మొదటి విడతగా రూ.3 లక్షల విలువైన రూ.500 నోట్లు ముద్రించాడు. వాటిని చెలామణి చేసేందుకు తన మిత్రుడు ప్రణయకుమార్‌ని సాయం కోరాడు. వారి మధ్య ఈ విషయంలో 1:3 నిష్పత్తిలో వాటా పంచుకునేలా ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ప్రణయ్‌కుమార్‌ సాయంతో జగద్గిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో దొంగ నోట్లను చెలామణి చేయించాడు.

దొరికిపోయిందిలా...

తొలిసారి చేసిన ప్రయత్నం విజయవంతం కావడంతో ఇంకా ఉత్సాహంగా వారు ఈ ప్రక్రియకు తెర తీశారు. రెండోసారి రూ.4.05 లక్షల విలువైన దొంగ నోట్లను ముద్రించి వాటిని కూడా చెలామణి చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే బాలానగర్‌ ఎస్ఓటీ, అల్లాపూర్‌ పోలీసులు శనివారం ఉదయం తనిఖీలు చేస్తుండగా.. ఈ ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారు. వీరి ప్రవర్తనను చూసి అనుమానించిన పోలీసులు వెంటనే వారిని సోదా చేయగా.. వారి వద్ద రూ.4.05 లక్షల విలువైన రూ.500 నోట్లు కనిపించాయి. వాటి గురించి తమదైన శైలిలో విచారించగా, అసలు బండారం బయటపడింది. వెంటనే ఉప్పల్‌లోని లక్ష్మీనారాయణ ఇంట్లో సోదా చేయగా.. ప్రింటర్, ల్యాప్‌టాప్, ప్రింటింగ్‌ సామగ్రి లభించాయి. లక్ష్మీనారాయణ ప్రింటింగ్‌ చేస్తున్న గదిలోకి కుటుంబ సభ్యులను కూడా రానిచ్చేవాడు కాదని పోలీసుల విచారణలో తెలిసింది. తాను లేనప్పుడు గదిలోకి కుటుంబసభ్యులు ఎవరూ వెళ్లకుండా గదికి తాళం వేసి ఉంచేవాడని వెల్లడైంది. పోలీసులు అన్ని అధారాలతో నిందితులను కోర్టు ముందు ప్రవేశపెట్టారు.

First Published:  4 Feb 2024 6:44 AM GMT
Next Story